
న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ వాటాదారుగా మారుతుంది. రేడియంట్ లైఫ్ కేర్ ప్రమోటరు అభయ్ సోయ్... విలీన సంస్థకు చైర్మన్‌గా ఉంటారు. మ్యాక్స్ హెల్త్‌కేర్ ప్రమోటర్లయిన అనల్జిత్ సింగ్ తదితరులు వైదొలుగుతారు. ‘రేడియంట్, మ్యాక్స్ హెల్త్‌కేర్ కలయికతో ఉత్తర భారతంలో అతి పెద్ద ఆస్పత్రుల నెట్‌వర్క్ ఏర్పాటవుతుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆస్పత్రుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా, బెడ్స్ పరంగా నాలుగో స్థానంలోనూ ఉంటుంది‘ అని రేడియంట్ తెలియజేసింది. విలీన సంస్థకు దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 పైచిలుకు బెడ్స్ (పడకలు) ఉం టాయి. వేల్యుయేషన్ నివేదిక ప్రకారం షేర్ల మార్పిడి నిష్పత్తిని పరిశీలిస్తే... విలీన సంస్థలో కేకేఆర్‌కు 51.9%, అభయ్ సోయ్‌కి 23.2%, మ్యాక్స్ ప్రమోటర్లకు 7% వాటాలుంటాయి. మిగతావి పబ్లిక్, ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. విలీన సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్ బ్రాండ్‌తోనే.. లోగోలో స్వల్ప మార్పులతో కొనసాగుతుందని రేడియంట్ పేర్కొంది.
ఒప్పందం ఇలా..
డీల్ కింద మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లైఫ్ హెల్త్‌కేర్‌కు ఉన్న 49.7 శాతం వాటాలను నగదు లావాదేవీ ద్వారా రేడియంట్ కొనుగోలు చేస్తుంది. అలాగే, మ్యాక్స్ ఇండియా తమ నాన్–హెల్త్‌కేర్ వ్యాపార విభాగాన్ని (మ్యాక్స్ బూపా, అంతర సీనియర్ లివింగ్) విడగొట్టి ప్రత్యేక కంపెనీగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేస్తుంది. ప్రస్తుత మ్యాక్స్ ఇండియా షేర్ హోల్డర్లకు కొత్త కంపెనీ షేర్లు కూడా దక్కుతాయి. రూ. 2 ముఖ విలువ గల ప్రతి 5 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖ విలువ ఉండే కొత్త కంపెనీ షేరు ఒకటి కేటాయిస్తారు. మరోవైపు, డీమెర్జర్ అనంతరం రేడియంట్‌కి చెందిన హెల్త్‌కేర్ అసెట్స్‌ను మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు బదలాయిస్తారు. అటుపైన దీన్ని మళ్లీ మ్యాక్స్ ఇండియాలో విలీనం చేసి (రివర్స్ మెర్జర్) కొత్త సంస్థను మ్యాక్స్ హెల్త్‌కేర్‌గా కొనసాగిస్తారు. రివర్స్ మెర్జర్ కారణంగా రూ. 2 ముఖవిలువ గల ప్రతి 100 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖవిలువ గల విలీన సంస్థ షేర్లు 99 కేటాయిస్తారు. కొనుగోలు వార్తలతో సోమవారం మ్యాక్స్ ఇండియా షేర్లు బీఎస్‌ఈలో 4.32 శాతం క్షీణించి రూ.80.80 వద్ద క్లోజయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment