భారత్‌కు అపశకునం! | Raghuram Rajan's departure is huge setback for reform in India | Sakshi
Sakshi News home page

భారత్‌కు అపశకునం!

Published Mon, Jun 20 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

భారత్‌కు అపశకునం!

భారత్‌కు అపశకునం!

రాజన్ నిష్ర్కమణ..
ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది
అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టకు దెబ్బ  
ఆర్థిక వేత్తల ముక్తకంఠం..

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి రఘురామ్ రాజన్ నిష్ర్కమిస్తుండటం... భారత్ ఆర్థిక వ్యవస్థకు అపశకునమేనని విఖ్యాత ఆర్థికవేత్తలు, మాజీ విధానకర్తలు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరిస్తున్న పాలసీ, మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్య విషయంలో తీసుకుంటున్న చర్యలను భారత ప్రభుత్వం సమర్థించడం లేదన్న అభిప్రాయం ప్రపంచదేశాల్లో నెలకొంటుందన్నారు.

రెండో విడత ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగేది లేదని.. ఆధ్యాపక వృత్తిలోకి తిరిగివెళ్లిపోనున్నట్లు రాజన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. కాగా, భారత్ ఆర్థిక వ్యవస్థను రాజన్ భ్రష్టుపట్టించాడని.. ఆయన్ను తక్షణం పదవినుంచి తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు ప్రధాని మోదీకి కూడా లేఖ రాయడం విదితమే. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ కొనసాగింపుపై తీవ్ర వివాదం, ఉత్కంఠ నెలకొన్నాయి. స్వయంగా ఇప్పుడు ఆయనే తనకు రెండో చాన్స్ వద్దని తేల్చిచెప్పడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
 
పోతేపోనీలే అన్నట్లు వ్యవహరించారు...

రాజన్ నిష్ర్కమణ భారత్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తుందని షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ సహచర ప్రొఫెసర్ అయిన లిగి జింగేల్స్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాజనాలను పరిరక్షించడంలో ఇతోధికంగా సేవలందించిన రాజన్ నిబద్దతను ప్రశ్నించడంతోపాటు నోటికొచ్చినట్లు కూడా మట్లాడారని.. అలాంటప్పుడు ఆయనను కొనసాగించేందుకు తీవ్రంగా ఒప్పించాల్సిన ప్రభుత్వం కూడా పోతేపోనీలే అన్నట్లు వ్యవహరించడం ఏమాత్రం బాగోలేదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు.

రాజన్ నిష్ర్కమణకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట విషయంలో తాను చాలా చింతిస్తున్నానని భారత్‌కు చెందిన ఆర్థికవేత్త, బ్రిటిష్ లేబర్ పార్టీ నేత మేఘనాధ్ దేశాయ్ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరుగా రాజన్ నిలుస్తారని భారత్ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు, ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్.. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిన ఘనతను దక్కించుకున్నారు. ప్రస్తుతం షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆన్-లీవ్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ‘ఒక్క భారత్‌కే కాదు ప్రపంచం మొత్తంలోనే రాజన్ ఎంత గొప్ప సెంట్రల్ బ్యాంకరో భవిష్యత్తులో అందరూ కచ్చితంగా ఒప్పుకుంటారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా దుర్ధినం’ అని గోపీనాథ్ పేర్కొన్నారు.
 
కొత్త గవర్నర్ ఎంపిక క్లిష్టతరమే...
రాజన్ తర్వాత ఆ పదవికి అంత సమర్ధులైనవారిని ఎంపిక చేయడం కష్టతరమైన అంశమేనని దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఏం చేయాలో అదిచేసినందుకు రాజన్‌ను అందరూ విమర్శించారని దేశాయ్ వ్యాఖ్యానించారు. కాగా, మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా రాజన్ నిష్ర్కమణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘రాజన్ తీసుకున్న నిర్ణయం భారత్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది.

ఇది మంచి శకునం కాదు’ అని మాయారామ్ ట్వీట్ చేశారు. ఆర్‌బీఐని వీడి మళ్లీ బూత్ స్కూల్‌కు వస్తుండడం మాకు లాభదాయం. భారత్‌కు మాత్రం తీవ్ర నష్టం అని జింగేల్స్ వ్యాఖ్యానించారు. రాజన్ ఆర్థిక శాస్త్రంలో తనకున్న గొప్ప నైపుణ్యం, సామర్థ్యాలతోనే ఆర్‌బీఐ అత్యున్నత పదవికి చేరుకోగలిగారని పేర్కొన్నారు. ‘ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక నిపుణుల్లో రాజన్ ఒకరు. అలాంటి వ్యక్తిని భారత్ వదిలేసుకుంటోంది. ఇది ప్రభుత్వంతోపాటు దేశం కూడా భవిష్యత్తులో చింతించే విషయం’ అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాపడ్డారు. ఆర్‌బీఐ పూర్తిగా స్వతంత్ర సంస్థకాదని కూడా ఆయన కుండబద్ధలు కొట్టడం గమనార్హం.
 
ఆయన చర్యలతో భారత్‌కు మేలు: కార్పొరేట్ ఇండియా
ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాజన్ నిష్ర్కమణపై భారత్ పారిశ్రామిక రంగం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో దేశ ఆర్థిక స్థిరత్వానికి అనేక రిస్కులు పొంచిఉన్నాయని.. అయితే, ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు, మార్పులతో భవిష్యత్తులో భారత్‌కు సానుకూల ఫలితాలు రానున్నాయని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది.

రాజన్ తన నిర్ణయంపై పునరాలోచిస్తారని భావిస్తున్నాం. ఆయన ఆర్‌బీఐ నుంచి వెళ్లిపోతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. ‘ఒకపక్క, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మరోపక్క, మొండిబకాయిలు ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారాయి. ఈ తరుణంలో రాజన్ నిష్ర్కమణ చాలా దురదృష్టకరం’ అని అశోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు.
 
పదవీకాలాన్ని పెంచాలి...
ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలు చేయడం, విధానపరమైన స్థిరత్వం ఉండాలంటే ఆర్‌బీఐ గవర్నర్ పదవీ కాలాన్ని కనీసం ఐదేళ్లపాటు ఉండేవిధంగా చూడాలి. వడ్డీరేట్ల నిర్ణయం కోసం ప్రతిపాదించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రాజన్ నిష్ర్కమణ తర్వాత కూడా కొనసాగుతుంది.
- రాకేశ్ మోహన్, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
 
రెండోసారి కొనసాగరాదన్నది రాజన్ వ్యక్తిగత నిర్ణయం. దీన్ని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే. అధ్యాపక వృత్తిలోకి మళ్లీ అడుగుపెట్టనున్న రాజన్‌కు రానున్నకాలంలో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్
 
భారత్‌లో 10 శాతం వృద్ధి రేటు, కోటి ఉద్యోగాల కల్పన కోసం కలలు కంటున్న ఇలాంటి తరుణంలో ఒక అత్యుత్తమ ఆర్థికవేత్త సేవలను దేశం కోల్పోతుండటం చాలా విచారకరం. దేశంలో ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మరింతమంది నిపుణులను భారత్‌కు రప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ‘ఇన్ఫీ’ నారాయణ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement