సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. భారీగా డిస్కౌంట్లను అందించే విమానయాన సంస్థల మాదిరిగానే రైల్వే కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. విమాన టికెట్ల మాదిరిగానే అడ్వాన్స్ బుకింగ్ రైల్వే టికెట్లపై డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందించాలని కమిటీ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే రైల్వే ప్రయాణీకులకు భారీ ప్రయోజనం లభించనుంది.
ఒక నెల రోజుల ముందు రైల్వే ప్రయాణీకులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించనుంది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం 50శాతం నుంచి 20శాతం దాకా అడ్వాన్స్ బుకింగ్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. రైలులో ఖాళీగా ఉన్న సీట్లను బట్టి ఈ డిస్కౌంట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు రైలు బయలుదేరడానికి ముందు రెండు రోజుల నుంచి రెండు గంటల వరకు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని సూచించింది. అలాగే లోయర్ బెర్త్ కోరుకునే ప్రయాణీకులు మాత్రం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వృద్ధులకు, మహిళలకు , పిల్లలకు లోయర్ బెర్త్ కేటాయింపు ఉచితమని పునరుద్ఘాటించింది. దీంతోపాటు అర్థరాత్రి , అపరాత్రి కాకుండా, కన్వీనియంట్ సమయాల్లో గమ్యానికి చేరే రైళ్లలో టికెట్ ధరలను పెంచాలని కూడా సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment