రజత్ గుప్తా కార్యకలాపాలు షురూ!
♦ స్నేహితుడు ఛటర్జీ కంపెనీలో.. ఇంటి నుంచే పని
♦ రెండు నెలలుగా ఇంట్లోనే నిర్బంధంలో...
♦ ఇపుడు స్వేచ్ఛ రావటంతో పూర్తిస్థాయి కార్యకలాపాలు
♦ మునుపటి ప్రతిష్ఠ కోసం కోర్టులోనూ పోరు
మార్క్ క్యూబన్ తెలుసా? బిలియనీర్ ఇన్వెస్టర్ మాత్రమే కాదు. అమెరికాకు చెందిన డల్లాస్ మావెరిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు యజమాని కూడా. ఇక అమెరికన్ టీవీ చానెళ్లు చూసేవారిలో లైఫ్‌స్టైల్ స్టార్ మార్తా స్టివార్ట్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో!!
వీరి గురించి ఇపుడెందుకంటే... 2004లో 44 ఏళ్ల క్యూబన్ తన ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ ‘మమ్మా.కామ్’లో వాటాలు విక్రయించారు. సమాచారం తెలిసి వాటాల్ని ముందే విక్రయించి, నష్టాలు తగ్గించుకున్నారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (సెక్) కేసు పెట్టింది. 2015 వరకూ ఈ కేసు నడిచింది. కోర్టు ఫీజులు, లాయర్ల ఫీజుల రూపంలో... సెక్ పేర్కొన్న జరిమానా కన్నా ఎక్కువే క్యూబన్ చెల్లించారు. 2015లో క్యూబన్ గెలిచి.. నిర్దోషిగా బయటపడ్డారు. దాతగా ఇపుడు పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. క్యూబన్‌కిపుడు 56 ఏళ్లు.
మార్తా స్టివార్ట్‌దీ ఇలాంటి కథే. ఆమె 2001లో ‘ఐఎంక్లోన్’ కంపెనీలో 2.3 లక్షల డాలర్ల విలువైన తన షేర్లు అమ్మేశారు. ఆ మర్నాడే షేరు ధర కుప్పకూలింది. దీనిపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలొచ్చి, అవి రుజువై ఆమెకు జైలు శిక్ష కూడా పడింది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక... ఆమె మళ్లీ టీవీ షోలలో పాల్గొన్నారు. తన కంపెనీ బోర్డులో కూడా మళ్లీ స్థానం సంపాదించుకున్నారు.
ఇవన్నీ ఎందుకంటే... హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రజత్ గుప్తా... ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రెండేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని రెండురోజుల కిందటే విడుదలయ్యారు. ఒకప్పుడు మెకిన్సే ఎండీగా, గోల్డ్‌మన్ శాక్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన రజత్ గుప్తా... నిజానికి జనవరి 5నే అమెరికా ఫెడరల్ కరెక్షనల్ కేంద్రం నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచీ మన్‌హటన్‌లోని తన ఇంట్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. అపార్ట్‌మెంట్ నుంచి బయటకు రాకుండా... చేతికి జైలు అధికారులిచ్చే బ్రేస్‌లెట్‌ను ధరించి ఉండేవారు. అయితే కరెక్షనల్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన దగ్గర్నుంచీ మెకిన్సేకు చెందిన తన పాత మిత్రుడు పూర్ణేందు ఛటర్జీ నిర్వహిస్తున్న వ్యాపారం కోసం పనిచేసేవారని ‘న్యూయార్క్’ టైమ్స్ వెల్లడించింది. నిజానికి గుప్తాకు జైలు శిక్ష పడినపుడు ఆయన్ను గట్టిగా సమర్థించింది ఛటర్జీ ఒక్కరే. తాజాగా గుప్తా పూర్తిస్థాయిలో విడుదల కావటంతో ఇకపై ఆయన పూర్తిస్థాయిలో కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలుస్తోంది.
రెండువారాల కిందటే కోర్టు స్వీకరణ
నిజానికి మళ్లీ బిజినెస్‌లోకి ప్రవేశించటం మాత్రమే కాదు. తనపై పడ్డ మచ్చను చెరుపుకోవటం కూడా గుప్తా మనసులో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో అమెరికాలోని మన్‌హటన్‌లో ఉన్న పప్పీళ్ల సెకండ్ సర్క్యూట్ కోర్ట్... గుప్తా వేసిన ఈప్పీలును విచారణకు స్వీకరించింది కూడా. రాజరత్నం నుంచి గుప్తాకు కనిపించని లాభమేదీ రాలేదని గుప్తా తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించి ఈ అపీలును తీసుకుంది. కేసు నుంచి బయటపడి మునుపటి తన పరువు ప్రతిష్ఠల్ని తిరిగి సంపాదించుకోవటం కూడా గుప్తా ఆలోచనగా తెలుస్తోంది.