
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ కుమార్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్యారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాగా వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఇటీవల ప్రణాళికబద్దమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్మికులు, వ్యాపార సంస్థలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల చట్టాలను సంస్కరించడమంటే రద్దు చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం వినియోగదారుల డిమాండ్‌ను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి బ్యాంక్‌లు, ఎంఎస్‌ఎమ్‌ఈ లు(సూక్క్ష్మ మద్య స్థాయి పరిశ్రమలు) కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.