Q1లో జున్‌జున్‌వాలా నెట్‌వర్త్‌ జూమ్‌ | Rakesh jhunjhunwala investments crosses rs 10,000 crores in Q1 | Sakshi
Sakshi News home page

Q1లో జున్‌జున్‌వాలా నెట్‌వర్త్‌ జూమ్‌

Published Tue, Jul 21 2020 1:19 PM | Last Updated on Tue, Jul 21 2020 1:23 PM

Rakesh jhunjhunwala investments crosses rs 10,000 crores in Q1 - Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్ జున్‌జున్‌వాలా నెట్‌వర్త్ రూ. 10,000 కోట్లను అధిగమించింది. వెరసి స్టాక్‌ మార్కెట్లలో రాకేష్‌ పెట్టుబడుల విలువ జూన్‌ చివరికల్లా రూ. 10,797 కోట్లను తాకింది. ఈ కాలంలో కొన్ని కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. మరికొన్ని కంపెనీలలో అదనపు పెట్టుబడుల ద్వారా వాటాలను పెంచుకున్నారు. కాగా.. అత్యంత ఫేవరెట్‌ స్టాక్స్‌ అయిన టైటన్‌ కంపెనీ, ఎస్కార్ట్స్‌లో పెట్టుబడులను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇతర వివరాలు చూద్దాం..

బిగ్‌బుల్‌
బిగ్‌బుల్‌గా పేరున్న రాకేష్‌ జున్‌జున్‌వాలా కోవిడ్‌-19 నేపథ్యంలోనూ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చారు. దీంతో ఈ ఏడాది క్యూ1లో పెట్టుబడుల విలువ రూ. 2514 కోట్లమేర పెరిగింది. సోమవారం ముగింపు ధరల ప్రకారం రాకేష్ , ఆయన కుటుంబ సభ్యుల పెట్టుబడుల విలువ రూ. 10,797 కోట్లకు చేరింది. తద్వారా మార్చి నుంచి చూస్తే 30 శాతం ఎగసింది. మార్చిలో రాకేష్‌ పెట్టుబడులు రూ. 8284 కోట్లుగా నమోదయ్యాయి. మార్చికల్లా 29 లిస్టెడ్‌ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటాలను కలిగి ఉండటం గమనార్హం!

లుపిన్‌లో ..
క్యూ1లో రాకేష్..‌ ర్యాలీస్‌ ఇండియా, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎన్‌సీసీ, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌లో వాటాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మరోపక్క లుపిన్‌, ఆగ్రో టెక్‌ ఫుడ్స్‌లో కొంతమేర వాటాలు విక్రయించారు. ఇక తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌లో 1.05 శాతం వాటాకు సమానమైన 12.5 మిలియన్‌ షేర్లను సొంతం చేసుకున్నారు. కాగా.. ఓరియంట్‌ సిమెంట్‌, ఎంసీఎక్స్‌, ఆయాన్‌ ఎక్స్ఛేంజీ, క్రిసిల్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తదితర 11 కంపెనీలలో వాటాలను యథాతథంగా కొనసాగించారు.

4 స్టాక్స్‌ జోరు
ఏప్రిల్‌ నుంచి ప్రధానంగా ర్యాలీస్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, జూబిలెంట్‌ లైఫ్‌, లుపిన్‌ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా రాకేష్ సంపద రూ. 1246 కోట్లమేర బలపడింది. క్యూ1లో పెరిగిన రూ. 2514 కోట్ల సంపదలో ఇది సగంకావడం విశేషం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement