
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్యూక్స్ బ్రాండ్‌తో బిస్కెట్లు, కన్ఫెక్షనరీ తయారీలో ఉన్న రవి ఫుడ్స్ హైదరాబాద్ సమీపంలోని కొత్తూరు వద్ద మెగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో 5 యూనిట్లతో ఇది రానుంది. నాలుగేళ్లలో ఈ మెగా ప్రాజెక్టుపై రూ.250 కోట్ల దాకా వెచ్చిస్తామని రవి ఫుడ్స్ ఎండీ రవీందర్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
భాగ్యనగరి వెలుపల కాటేదాన్ పారిశ్రామిక వాడలో రవి ఫుడ్స్‌కు ప్రస్తుతం 10 తయారీ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటన్నిటినీ దశల వారీగా మూసివేస్తారు. వచ్చే కొన్నాళ్లలో తయారీ అంతా కొత్తూరులోని మెగా ప్లాంటులోనే చేపడతారు. బ్రిటానియా, ఐటీసీ, పార్లె వంటి కంపెనీల కోసం రవి ఫుడ్స్ పలు ఉత్పత్తులను తయారు చేస్తోంది.
రెండింతలకు టర్నోవర్..
రవి ఫుడ్స్ 2017–18లో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి టర్నోవర్ రెండింతలకు చేరుస్తామని రవీందర్ అగర్వాల్ చెప్పారు. ‘10 ప్లాంట్లకుగాను నెలకు 15,000 టన్నుల తయారీ సామర్థ్యం ఉంది. ఇందులో 50 శాతం కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, 50 శాతం సొంత బ్రాండ్ అయిన డ్యూక్స్ కైవసం చేసుకుంది.
నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత 2,200 నుంచి 4,000లకు చేరుతుంది. ఎగుమతుల ఆదాయం రెండింతలై రూ.800 కోట్లను తాకుతుందని విశ్వసిస్తున్నాం’ అని తెలియజేశారు. కాగా, ఆసియా వన్ మ్యాగజైన్, యునైటెడ్ రిసర్చ్ సర్వీసెస్ మీడియా కన్సల్టింగ్ నుంచి 2017–18కిగాను ఆసియాలోని 100 వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్రాండ్స్‌లో డ్యూక్స్, గ్రేటెస్ట్ లీడర్స్ జాబితా లో రవీందర్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment