![RBI bars Bandhan Bank from opening new branches - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/29/bandan.jpg.webp?itok=hKYsVKtm)
ముంబై: లైసెన్స్ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్ బ్యాంకుపై ఆర్‌బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్ ఘోష్ పారితోషికాన్ని స్తంభింపజేసింది.
‘‘బ్యాంకులో నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ తమను ఆదేశించినట్లు బంధన్ బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్‌బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌కు యూనివర్సల్ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment