new branches
-
తెలుగు రాష్ట్రాల్లో 100కు శాఖల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్యను 100 పైచిలుకు స్థాయికి పెంచుకోనున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాలను పూర్తి స్థాయి జోన్‌గా మార్చే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సంఖ్య 78గా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ లోన్‌బుక్ 10,500 కోట్ల స్థాయిలో ఉందని, రిటైల్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నామని శ్రీనివాసన్ వివరించారు. ప్రత్యేక ప్రాంతీయ క్రెడిట్ హబ్ ద్వారా గ్రామీణ, వ్యవసాయ రంగాల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నట్లు తెలిపారు. నలభై అయిదేళ్ల వ్యవధిలో సాధించిన వ్యాపారాన్ని గత అయిదేళ్లలో రెట్టింపు చేసుకున్నామని శ్రీనివాసన్ చెప్పారు. ఇక్కడి నుంచి మూడేళ్లలోనే రెట్టింపు వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1,600 శాఖలు ఉన్నాయి. -
విజయా డయాగ్నొస్టిక్స్ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ఫ్యూజిఫిల్్మకి చెందిన అధునాతన ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్ ఈ విషయాలు తెలిపారు. క్లోజ్డ్గా ఉండే ఎంఆర్ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్ మెషీన్.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్ విభాగం) చందర్ శేఖర్ సిబాల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విస్తరణ దిశగా ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. మార్చి నాటికి హోల్ సేల్, రిటైల్ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్ బజాజ్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్‌లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్‌లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు. రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. -
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఈ ఏడాది భారీగా కొత్త బ్రాంచ్‌లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 300 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 22,405 శాఖలు ఉన్నాయి. అలాగే, 235 విదేశీ శాఖలు సైతం పనిచేస్తున్నాయి. ఒకవైపు డిజిటల్‌గా విస్తరిస్తూనే, మరోవైపు అవసరమున్న చోట భౌతికంగా శాఖలను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. అలాగే, బిజినెస్ కరస్పాడెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు. ‘‘కస్టమర్లకు ఏమి కావాలన్నది మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా వాహకాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందించే చర్యలు తీసుకుంటున్నాం. మాకు ఇప్పటికే ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఫలితాలను రాబడుతున్నాం’’అని ఖరా ప్రకటించారు. నికర వడ్డీ మార్జిన్ గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.5 శాతంగా ఉంటుందన్నారు. జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.16,884 కోట్ల లాభాన్ని ప్రటించడం తెలిసిందే. -
కరూర్ వైశ్యా బ్యాంక్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్టార్ట్.. ఎక్కడంటే?
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) తమ 800వ శాఖను చెన్నైలో ప్రారంభించింది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు (తెలంగాణలోని గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి) తమిళనాడులో ఇంకో ఆరు బ్రాంచీలను తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 808కి చేరిందని బ్యాంకు ఎండీ రమేష్ బాబు తెలిపారు. అటు తొలి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డీబీయూ)ని కూడా చెన్నైలో ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సేవింగ్స్ ఖాతాలను తెరవడం, రిటైల్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం, టర్మ్ డిపాజిట్లు తదితర లావాదేవీలన్నింటినీ నిర్వహించుకోవచ్చని రమేష్ బాపు చెప్పారు. కేవీబీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,40,806 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. రూ. 1,106 కోట్ల లాభం ఆర్జించింది. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
తెలుగు రాష్ట్రాల్లో 179 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 6–9 నెలల్లో కొత్తగా 179 శాఖలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 90 తెలంగాణలో, 89 ఆంధ్రప్రదేశ్‌లో ఉండనున్నాయి. ఇందుకోసం 5,000 మంది సిబ్బందిని బ్యాంక్ తీసుకోనుంది. వ్యాపారవర్గాల కోసం రూపొందించిన స్మార్ట్‌హబ్ వ్యాపార్ యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (దక్షిణాది) తరుణ్ చౌదరి గురువారం ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 588 శాఖలు ఉన్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో 10,000 రకాల పైచిలుకు ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, స్మార్ట్‌హబ్ యాప్‌తో చెల్లింపులు, బ్యాంకింగ్ సర్వీసులు పొందడం వ్యాపార వర్గాలకు సులభతరం అవుతుందన్నారు. గతేడాది జూలైలో ప్రయోగాత్మకంగా యాప్‌ను ప్రవేశపెట్టామని, ఈ నెలాఖరు నాటికి యూజర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుందని చౌదరి తెలిపారు. -
ఇండియా పోస్ట్ భారీ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంటి వద్దకే సేవలను అందించడం లక్ష్యంగా ఇండియా పోస్ట్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 శాఖలను తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమతి లభించిందని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ సెక్రటరీ అమన్ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన శాఖలను తెరువనున్నట్టు చెప్పారు. వీటి చేరికతో మొత్తం శాఖల సంఖ్య సుమారు 1.7 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ‘పోస్టల్ శాఖను విస్తరించాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చేరువలో ఉండాలన్నది భావన. పోస్టాఫీసుల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు సమకూర్చింది. డ్రోన్ల ద్వారా డెలివరీలను ఇటీవల గుజరాత్లో విజయవంతంగా నిర్వహించాం. 2012లో ప్రారంభించిన ఐటీ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతికత ఆధారంగా పోస్టల్, ఇతర ప్రభుత్వ సేవలు త్వరలో ఇంటి వద్దకే అందనున్నాయి. ప్రజలు పోస్టాఫీసులకు రావాల్సిన అవసరం ఉండదు. మహమ్మారి కాలంలో ఆధార్ సహిత చెల్లింపుల వ్యవస్థ ఆధారంగా రూ.20,000 కోట్ల పైచిలుకు నగదును ప్రజల ఇంటి వద్దకే చేర్చాం’ అని వివరించారు. -
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 100 శాఖల ఏర్పాటు
ముంబై: కస్టమర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీనితో మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు మరింతగా విస్తరించినట్లవుతుందని పేర్కొంది. ఈ 100 డిజిటల్ ఆధారిత శాఖల్లో ఇప్పటికే 60 బ్రాంచీల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగతావి నవంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ నవీన్ తహిలియాని వివరించారు. ఏజెన్సీ పంపిణీ వ్యవస్థ లేని 70 ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటైనట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో డీబీఎస్ బ్యాంక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ ప్రియాశిష్ దాస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భాగ్యనగరిలో 40 వేల పైచిలుకు కస్టమర్లున్నారని వివరించారు. బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,000లకు పైగా ఉంది. పూర్తిగా కాగిత రహిత విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
కస్టమర్లకూ ‘రెపో’ లాభం!
సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పరంగా అనేక అడుగులు వేస్తోందని, అందుకే తాము పలు కార్యక్రమాల్లో భాగం కాగలిగామని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తెలియజేసింది. తెలంగాణలో ప్రస్తుతం తమకు 135 బ్రాంచీలుండగా... ఈ ఏడాది డిసెంబరు ఆఖరునాటికి మరో 30 ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 150 బ్రాంచీలున్నాయని... డిసెంబరు ఆఖరికల్లా రెండు రాష్ట్రాల్లోనూ ఇంచుమించు సమాన సంఖ్యలో బ్రాంచీలుంటాయని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. సోమవారమిక్కడకు వచ్చిన సందర్భంగా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఏపీ, తెలంగాణ సర్కిల్ మధుసూదన రావుతో కలిసి ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... తెలంగాణ ప్రభుత్వం అనేకరకాలుగా ముందుకొస్తున్నట్లు మీరు చెబుతున్నారు. ఏ రకంగానో చెప్పగలరా? సిద్ధిపేటను నగదు రహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మేం 10 గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఖాతాలు తెరిచాం. అన్ని దుకాణాలకూ ఈడీసీ మెషీన్లు అందజేశాం. ఇక ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌కు, గనులు–భూగర్భ వనరుల శాఖ లావాదేవీలకు, ఇసుక నిర్వహణ వ్యవస్థకు, ఫాస్టాగ్ సొల్యూషన్స్‌కు, ఫిషరీస్ విభాగ బ్లూ రివొల్యూషన్ పథకానికి, పశు సంవర్థక శాఖ గొర్రెలు–మేకల పథకానికి ఇలా అన్నిటికీ మేం అధికారిక బ్యాంకరుగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డెయిరీకి కూడా నగదు నిర్వహణ సేవలందిస్తున్నాం. ఇలాంటి ఒప్పందాలు మిగతా ఏ రాష్ట్రంతోనైనా ఉన్నాయా? గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక... ఇలా చాలా రాష్ట్రాలతో రకరకాల అంశాలకు సంబంధించి ఒప్పందాలున్నాయి. పలు సేవలందిస్తున్నాం. ఇలాంటివన్నీ మా నుంచి కాకుండా స్థానికంగా ఉండే ప్రభుత్వాన్ని బట్టే ఉంటాయి. ప్రభుత్వం ముందుకొచ్చి పారదర్శకంగా, వేగవంతమైన సేవలందిస్తామంటే ఇలాంటివి ఎన్నయినా సాధ్యమవుతాయి. సరే! ఆర్బీఐ గడిచిన ఆరు నెలల్లో రెపోరేటు ముప్పావు శాతం... అంటే 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కానీ ఏ బ్యాంకూ దీన్ని పూర్తిగా వినియోగదారుకు అందించలేదు. ఎందుకని? నిజం! ఆర్బీఐ మూడు దఫాలుగా రెపో రేటు తగ్గించినా అదింకా పూర్తిగా వినియోగదారు స్థాయికి చేరలేదు. కాకపోతే మా బ్యాంకయినా, ఏ బ్యాంకయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గతంలో ఇలాంటివి వినియోగదారు స్థాయికి బదిలీ కావటానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ ప్రక్రియ మెరుగుపడి, వేగవంతమయింది. మొదట డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించటంతో మొదలై.. మెల్లగా రుణాలపై రేట్లు కూడా తగ్గుతాయి. త్వరలోనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాం. కాకపోతే ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడు చెప్పలేం. మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్ బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు తగ్గుతాయని చెబుతున్నా కావటం లేదు. ఎందుకని? మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే ఎన్పీఏలకు కేటాయింపుల విషయంలో మేం చాలా సంప్రదాయకంగా వ్యవహరిస్తున్నాం. అంటే ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాం. ఏ కొంచెం అవకాశమున్న ఖాతాలనైనా దాచకుండా ఎన్పీఏలుగా వర్గీకరిస్తున్నాం. ఈ కారణాల వల్లే మా ఎన్పీఏలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇలా వ్యవహరించటం బ్యాంకు ఆరోగ్య రీత్యా మంచిదే. ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల సంక్షోభం మాటేంటి? ఇందులో మీ బ్యాంకు వాటా ఎంత? సంక్షోభం కొలిక్కి వస్తుందనే నేను భావిస్తున్నాం. చర్చల ప్రక్రియతో ఇలాంటి సంక్షోభాలను మరింత ముదరకుండా నివారించవచ్చన్నది నా నమ్మకం. మాకు వీటిలో ఎంత వాటా ఉందనేది ఇప్పుడు చెప్పటం సాధ్యం కాదు. బ్రోకింగ్ సేవల విషయానికొస్తే మీరెందుకు చాలా వెనకబడ్డారు? నిజమే! ఇప్పుడొచ్చిన డిస్కౌంట్ స్టాక్ బ్రోకరేజీ సంస్థలు, ఇతరులతో పోలిస్తే యాక్సిస్ డైరెక్ట్ కొంత వెనకబడినట్టే. కాకపోతే మేం కస్టమర్ల సంఖ్యపై కాకుండా మా కస్టమర్లకు ఈ సేవల్ని ఎంత మెరుగ్గా అందించగలమనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. ఇటీవలే ట్రేడ్–20ని అమల్లోకి తెచ్చాం. దీనిద్వారా షేర్లకు సంబంధించి ఏ లావాదేవీకైనా రూ.20 మాత్రమే వసూలు చేస్తాం. కాకపోతే కస్టమర్లు తమ ఖాతాల్లో రూ.75వేల సగటు బ్యాలెన్స్ నిర్వహించాలనే షరతు ఉంది. బ్రోకింగ్ సేవల్ని ఇపుడు బాగా విస్తరిస్తున్నాం. మా మొబైల్ బ్యాంకింగ్, బ్రోకింగ్ యాప్‌లు చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయి. మీకింకా నగదు కొరత ఉందా? ఏటీఎంలు తగ్గిస్తున్నారా? అలాంటిదేమీ లేదు. ఇపుడు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అందరికీ పుష్కలంగా నగదు అందుబాటులో ఉంచుతోంది. కొత్త వాటితో సహా ప్రతి బ్రాంచిలోనూ ఏటీఎంను ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి మాకు 4,050 బ్రాంచీలు, 11,801 ఏటీఎంలు ఉన్నాయి. మున్ముందు బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ జరుపుకోవటానికి వీలయ్యే సెల్ఫ్ సర్వీస్ ఏటీఎంల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. -
బంధన్ బ్యాంకుకు షాక్
ముంబై: లైసెన్స్ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్ బ్యాంకుపై ఆర్బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్ ఘోష్ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్బీఐ తమను ఆదేశించినట్లు బంధన్ బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌కు యూనివర్సల్ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. -
రైతు రుణాలే ప్రాధాన్యం
-
రైతు రుణాలే ప్రాధాన్యం
పెందుర్తి, భోగాపురంలో విజయా బ్యాంకు కొత్త శాఖలు విశాఖపట్నం: విజయా బ్యాంక్ కొత్తగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్‌లను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు సోమవారం ప్రారంభించారు. విశాఖ జిల్లా పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురంలోని ఈ శాఖల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతుల అవసరాలకు తగ్గట్టు రుణ సదుపాయాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం తమ బ్యాంకు ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామీణుల కోసం, ముఖ్యంగా రైతు కుటుంబాల అభివృద్ధి కోసమే 1931లో బ్యాంకును స్థాపించారని చెప్పారు. బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 189 బ్రాంచీలు, 162 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,847 కోట్ల వ్యాపారం చేసినట్లు చెప్పారు. 21 లక్షల మంది ఖాతాదారులను 3 ప్రధాన సాంఘిక సంక్షేమ పథకాల్లో (ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన) చేర్చినట్లు చెప్పారు. సామాజిక బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు పి.శ్రీనివాసరెడ్డి, వై.మురళీకృష్ణ, బి.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.