సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం (25 బేసిక్ పాయింట్లు) చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 10ఏళ్ల కనిష్టానికి చేరింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రెపో రేటు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలీ చేస్తే ఈఎంఐ భారం తగ్గనుంది.
ఉదాహరణకు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే (20 ఏళ్ల కాలపరిమితి) ఇప్పటి వరకు 8.6 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ 26,225, అయితే తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 8.35కు తగ్గి, ఈఎంఐ 25,751 కానుంది.
పదేళ్ల కాలపరిమితితో 25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటేప్రస్తుత ఈఎంఐ రూ. 31,332 ఉంటే తాజా తగ్గింపుతో ఇది దాదాపు 30,996గా ఉండవచ్చు. అంటే రుణమొత్తం పూర్తయ్యేనాటికి లెక్కిస్తే రుణ దాత కట్టాల్సిన మొత్తంలో దాదాపు 40,000 కు పైగా భారం తగ్గుతుంది.
ఈ తగ్గింపు రేట్లు వాహనాల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు 7 ఏళ్ల కాలపరిమితితో రూ.10 లక్షల కారు లోన్ తీసుకుంటే, ఈఎంఐ రూ.16,089 నుంచి రూ.15,962కి తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment