RBI Rate cut
-
రెపో రేటు కోత : ఈఎంఐ ఎంత తగ్గనుంది?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం (25 బేసిక్ పాయింట్లు) చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 10ఏళ్ల కనిష్టానికి చేరింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెపో రేటు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలీ చేస్తే ఈఎంఐ భారం తగ్గనుంది. ఉదాహరణకు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే (20 ఏళ్ల కాలపరిమితి) ఇప్పటి వరకు 8.6 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ 26,225, అయితే తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 8.35కు తగ్గి, ఈఎంఐ 25,751 కానుంది. పదేళ్ల కాలపరిమితితో 25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటేప్రస్తుత ఈఎంఐ రూ. 31,332 ఉంటే తాజా తగ్గింపుతో ఇది దాదాపు 30,996గా ఉండవచ్చు. అంటే రుణమొత్తం పూర్తయ్యేనాటికి లెక్కిస్తే రుణ దాత కట్టాల్సిన మొత్తంలో దాదాపు 40,000 కు పైగా భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు రేట్లు వాహనాల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు 7 ఏళ్ల కాలపరిమితితో రూ.10 లక్షల కారు లోన్ తీసుకుంటే, ఈఎంఐ రూ.16,089 నుంచి రూ.15,962కి తగ్గుతుంది. -
రేట్ కట్కు మార్కెట్లు నెగిటివ్‌గా ఎందుకు స్పందించాయి?
సాక్షి, ముంబై: ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించినా స్టాక్‌మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి. సాధారణంగా కీలక వడ్డీరేటుపై ఆర్బీఐ కోత విధించినపుడు సహజంగా స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా స్పందించడం ఇప్పటి వరకూ చూశాం. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారు. దీంతో కీలక వడ్డీరేటు కోత బ్యాంకింగ్ సెక్టార్ భారీగా లాభపడుతుంది. కానీ గురువారం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ విపరీత పరిణామానికి విశ్లేషకులు అయిదు కారణాలను ప్రధానంగా చెబుతున్నారు. విశ్లేషకుల అంచనాలకనుగుణంగానే ఆర్బీఐ గవర్నర్ శక్తింకాత దాస్ నేతృత్వంలోని మానటరీ పాలసీ రెపోరేటులో 25 బేసిస్ పాయింట్ల కోతకు నిర్ణయించింది. అదీ కమిటీ సభ్యులందరూ రేటు కోతకే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైన తరువాత ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ఇదేమొదటిసారి. అయితే మరి దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎందుకు నెగిటివ్‌గా స్పందించాయి. ఆర్బీఐ వడ్డీరేటు పదేళ్ల కనిష్ట స్థాయికి చేరగా, తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌మార్కెట్ ఇంట్రాడేలో ఏకంగా 600 పాయింట్ల పతనానికి చేరువైంది. చివర్లో కోలుకున్నా 554 క్షీణించి, సెన్సెక్స్ 40వేల దిగువకు, 178 పాయింట్లు పతనమైన నిఫ్టీ 12వేల దిగువకు చేరింది. డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభం : దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ (డిహెచ్ఎఫ్ఎల్) పై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు క్రిసిల్, ఐక్రా, కేర్ రేటింగ్‌ను బాగా తగ్గించాయి. దీంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 15 శాతం కుప్పకూలాయి. రూ. 95 వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. డెహెచ్ఎఫ్ఎల్ ద్వారా డిహెచ్ఎఫ్ఎల్ ద్వారా డిపాజిట్ హోల్డర్లకు అప్రమత్తంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ బ్రోకరేజి సంస్థ సిఎల్ఎస్ఎ రూ. 1,000 కోట్ల మేర డిఫాల్ట్ అయినట్టు తాజాగా పేర్కొంది. ఇది మరింత ఆందోళన రేపింది. లిక్విడిటీ అంశం. ద్రవ్య సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్బీఐ పాలసీ ప్రకటనలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్వెస్టర్లలో ఇది మరింత ఆందోళన రేపిందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ద్రవ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్బీఐ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది, వీటి సిఫార్సులు ఆరు వారాల తరువాత మాత్రమే వెల్లడి కానున్నాయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల భవిష్యత్తు ఆందోళన కూడా ఇతర అంశాలపై ప్రభావితం చేసిందని అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీల రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని అన్నారు. మందగించిన జీడీపీ వృద్ధి అంచనాలు: 2019 - 20 ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాపై కోత విధించింది. ట్రేడ్‌వార్ భయాలు, తద్వారా అంతర్జాతీయంగా క్షీణించిన డిమాండ్ లాంటి అంశాలపై కేంద్ర బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఎగుమతులు, పెట్టుబడులను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. 2019 ఏప్రిల్ నాటి ఆర్బీఐ సమీక్షలో 2019-20 సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాలు 7.2 శాతం నుండి 7 శాతానికి తగ్గించింది. ట్రేడ్ వార్ ఆందోళన: అంతర్జాతీయంగా పెరుగుతున్న ట్రేడ్‌వార్ ఆందోళన పెట్టుబడిదారుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రధానంగా అమెరికా-మెక్సికో చర్చల్లో తగిన పురోగతి లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించడం గమనార్హం. గ్లోబల్ ఆర్థికవ్యవస్థ మందగమనం: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లాగార్డే బుధవారం మాట్లాడుతూ టారిఫ్ బెదిరింపులు వ్యాపారాన్ని, మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఏడాది వృద్ధిరేటు మందగిస్తుందని భావించారు. మాంద్య పరిస్థితులు వచ్చే అవకాశం లేనప్పటికీ అమెరికా-చైనా ట్రేడ్‌వార్ కారణఃగా 2020 ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి 0.5 శాతం, లేదా సుమారు 455 బిలియన్ డాలర్లు తగ్గిపోతుందని హెచ్చరించారు. -
ఆర్బీఐ రేటు కట్ : మార్కెట్లు ఫట్
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ రెపోరేట్ కట్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు నెగిటివ్‌గా స్పందించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాల ధోరణి కనిపించింది. దీంతో నిఫ్టీ బ్యాంకు (700) గత నాలుగేళ్లలోలేని భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కూడా దాదాపు అదే బాట. సెన్సెక్స్ 554 పాయింట్లు క్షీణించి 39530 వద్ద, నిఫ్టీ 178 పాయింట్లు పతనమై 11844 వద్ద ముగిసాయి 2019లో అతి పెద్ద వన్డే పతనాన్ని నమోదు చేశాయి. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా భారీగా నష్టపోయాయి. తద్వారా సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరాయి. అన్ని రంగాలూ నష్టాల్లో ముగియాగా, ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 5 శాతం కుప్పకూలింది. ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, మీడియా రంగాలుకూడా ఇదే బాటలో నడిచాయి. గెయిల్ 11.5 శాతం కుప్పకూలగా.. ఐబీ హౌసింగ్, ఇండస్ఇండ్, యస్ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, బీపీసీఎల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, ఎంఅండ్ఎం 7.7-2.4 కుప్పకూలి టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అలాగే రిలయన్స్ క్యాప్, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా భారీగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో అలహాబాద్, ఓబీసీ, బీవోబీ, సిండికేట్, బీవోఐ, యూనియన్, ఎస్బీఐ, కెనరా, పీఎన్బీ, జేఅండ్‌కే, ఇండియన్ బ్యాంక్ 7.4-2.4 శాతం మధ్య నీరసించాయి. మరోవైపు కోల్ ఇండియా, టైటన్, హీరోమోటో, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, యూపీఎల్ 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. -
వడ్డీ రేటు కోత : అమ్మకాల మోత
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 25 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గిస్తూ ఆర్బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో అమ్మకాల జోరు కొనసాగింది. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాటల మధ్య కొనసాగుతూ, మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో 200 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి సెన్సెక్స్ 192 పాయింట్లు క్షీణించి 38,685 వద్ద నిఫ్టీ 46 పాయింట్లు బలహీనపడి 11,598 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్, బ్యాంక్స్ భారీగా నష్టపోగా, ఫార్మా, మీడియా, ఆటో లాభపడ్డాయి. ఐబీ హౌసింగ్, జీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, బ్రిటానియా, ఎయిర్టెల్, హీరో మోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, బీపీసీఎల్, యస్ బ్యాంక్, గెయిల్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, పవర్‌గ్రిడ్ టాప్‌లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు డాలరుతో మారకంలో బలహీనంగా ప్రారంభమైన రూపాయి సైతం 65 పైసలు పతనమై 69 దిగువకు చేరింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్ : సెంచరీ నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతోకొనసాగుతోంది. ఈ ఏడాది వర్షపాత అంచనాలు నిరాశపరచడంతో బుధవారం బలహీన పడిన స్టాక్‌మార్కెట్లు ఆర్బీఐ నేడు (గురువారం) ప్రకటించిన రేట్ కట్‌తో నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయిట్లు క్షీణించి 38758 వద్ద,నిఫ్టీ 37 పాయింట్లు బలహీనంతో 11609వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకు నష్టపోతుండగా, రియల్టీ, ఆటో, ఫార్మా లాభపడుతున్నాయి. ఐబీ హౌసింగ్, హీరో మోటో, ఎయిర్టెల్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బ్రిటానియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టైటన్ లాభనపడుతున్నాయి. మరోవైపు రిలయన్స ఇండస్ట్రీస్, టీసీఎస్,ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యస్ బ్యాంక్, హిందాల్కో, బీపీసీఎల్, గెయిల్, యూపీఎల్, ఇండస్ఇండ్, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. ఎయిర్‌లైన్స్ షేర్లు లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్ అవుతోంది. కాగా అంచనాలకనుగుణంగానే ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 0.25 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు ఏడాది తరువాత 6 శాతానికి దిగివచ్చింది. -
ఆర్బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం కోరుతున్నప్పటికీ... ఆర్బీఐ మాత్రం తగ్గించకపోవచ్చని అసోచామ్ పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును పెంచడం కారణంగా డాలరు విలువ ఎగబాకుతుండటంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోందని, దీంతో ఆర్బీఐ రేట్ల కోతకు ఆస్కారం తక్కువేనని అభిప్రాయపడింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు పెరగడం కూడా మరో కారణమని తెలిపింది. ‘పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) భారీగా పెరిగింది. ఇక రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు రెండూ దిగొచ్చాయి. అయితే, రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లన్నీ వచ్చిచేరితే పరిస్థితి మారిపోతుంది. మరోపక్క చక్కెర, గోదుమలు వంటి కొన్ని ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. అన్నింటికంటే అతిపెద్ద రిస్కు అమెరికా డాలరు బలపడుతుండటమే. వర్ధమాన దేశాల నుంచి విదేశీ నిధులు వెనక్కిపోతున్నాయి. ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తున్నాయి. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తోంది. అయితే, దీని ప్రభావం మన దేశంపై కొంత తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రూడ్ ధరల పెరగుదల మాత్రం ప్రతికూలాంశమే. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ దిగుమతిదారుగా భారత్ నిలుస్తోంది. డాలర్ బలోపేతంవల్ల తక్షణ ప్రత్యక్ష ప్రభావం చెల్లింపుల సమతుల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)పై ఉంటుంది. దీనివల్ల మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు’ అని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా పేర్కొన్నారు. క్రూడ్ ధరల జోరు, రూపాయి విలువ క్షీణత... మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రతికూలాంశాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇక డీమోనిటైజేషన్ ప్రభావంతో జీడీపీ వృద్ధి రేటు కూడా మందగించే రిస్కు ఉందన్నారు. కీలకమైన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై అనిశ్చితి నెలకొందని చెప్పారు. అయినా కూడా పారిశ్రామిక రంగం మాత్రం వడ్డీ రేట్లు తగ్గాలనే కోరుకుంటోందని.. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆర్బీఐ రేట్ల కోతకు ఏమాత్రం సానుకూలంగా లేవని కనోరియా చెప్పారు. తాజా పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను(రెపో రేటు) యథాతథంగా కొనసాగిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లిక్విడిటీ భారీగా పెరిగిన నేపథ్యంలో రెపో రేటును కనీసం పావు శాతమైనా తగ్గిస్తుందని అధికశాతం విశ్లేషకులు అంచనా వేశారు. -
తగ్గనున్న గృహరుణాల ఈఎంఐలు
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 25 పాయింట్లు, వడ్డీ రేట్లను 6.25శాతానికి తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు గృహ రుణాల చెల్లింపుదారుల పాలిట వరమే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండిగ్ రేట్స్(ఎమ్ సీఎల్ఆర్)ను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గుదల లాభాలను వినియోగదారులకు బ్యాంకులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు లోన్ తీసుకునే సమయంలో ఉన్న వడ్డీ రేట్లనే రుణం తీరిపోయే వరకూ బ్యాంకులు పాటించేవి. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి ఆ మొత్తం చెల్లించే వరకూ సమకాలీన మార్పులతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు చేయాల్సివచ్చేది. ఏప్రిల్1 కంటే ముందు లోన్లు తీసుకున్నవారు కూడా ఎమ్ సీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానానికి మారవచ్చు. ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించడంతో సాధారణ వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం వల్ల మార్కెట్ లోకి ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015 జనవరి నుంచి ఇప్పటివరకూ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 175 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కాగా తగ్గిన వడ్డీ రేట్లలో పావు శాతానికి పైగా మాత్రమే వినియోగదారుల వద్దకు వెళ్లింది. ఆర్బీఐ తగ్గించిన 25 పాయింట్ల రెపో రేటుకు చెందిన ఫలాలు వినియోగదారులను చేరితే.. రూ.30 లక్షలను(20 ఏళ్ల చెల్లింపు) గృహ రుణంగా తీసుకున్న వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఏడాదికి రూ.5,855లు తగ్గుతాయి. అదే రూ.50 లక్షలు(20 ఏళ్ల చెల్లింపు), రూ.75లక్షలు(20 ఏళ్ల చెల్లింపు) రుణాలు తీసుకున్న వారికి ఏడాదికి రూ.9,759లు, రూ.14,638లు తగ్గుతాయి. -
ప్రతి ద్రవ్యోల్బణంలోనే..
వరుసగా 10వ నెలలోనూ క్షీణించిన టోకు ధరల రేటు - ఆగస్టులో మైనస్ (-) 4.95 శాతం - ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.66 శాతంగా నమోదు - రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలే - ఆర్బీఐ రేటు కోతపై పెరిగిన ఆశలు.. న్యూఢిల్లీ: చౌక కమోడిటీల కారణంగా టోకు ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టస్థాయికి పడిపోయింది. వరుసగా 10వ నెల ఆగస్టులోనూ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా ‘మైనస్’ (ప్రతి)లో నిలిచింది. ప్రతి ద్రవ్యోల్బణం రేటు -4.95 శాతంగా ఉంది. అంటే గత ఏడాది ఆగస్టుతో పోల్చితే 2015 ఆగస్టులో టోకు ధరల బాస్కెట్ ఉత్పత్తుల ధర అసలు పెరక్కపోగా, అప్పటి ధరతో పోల్చితే 4.95 శాతం క్షీణించిందన్నమాట. ఇది చరిత్రాత్మక రికార్డు. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కూడా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో 3.66 శాతంగా నమోదయ్యింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తదుపరి రేటు కోతకు డిమాండ్ తీవ్రమవుతోంది. టోకున... మూడు విభాగాలూ... టోకు ద్రవ్యోల్బణం గత ఏడాది ఆగస్టులో 3.85 శాతం. సూచీలోని మూడు విభాగాలూ అప్పట్లో ద్రవ్యోల్బణం పెరుగుదలనే నమోదుచేసుకున్నాయి. అయితే గడచిన 10 నెలల నుంచీ ఈ సూచీ క్షీణతలోకి జారిపోయింది. వార్షికంగా మూడు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ విభాగాలతో కూడిన ఈ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం రేటు -3.71 శాతం. 2014 ఆగస్టులో ఈ రేటు 3.69 శాతం. ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూసుకుంటే ఆ విభాగంలో రేటు 5.11 శాతం నుంచి -1.13 శాతానికి పడిపోయింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు 4.29 శాతం నుంచి -0.69 శాతానికి దిగింది. ఫ్యూయెల్, పవర్: 4.54 శాతం రేటు -16.50 శాతానికి దిగింది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం -1.92 శాతంగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ రేటు 3.65 శాతం. రిటైల్ ‘ద్రవ్యోల్బణం’ మరింత కిందకు... రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో మరింతగా కిందకుదిగి 3.66 శాతానికి పడింది. 2014 ఆగస్టు నెలలో ఈ రేటు 7.8 శాతం. కాగా, సవరించిన గణాంకాల ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతం. ఇందులో ముఖ్యమైన ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.92 శాతంగా ఉంది. కూరగాయలు (-6.36 శాతం), చక్కెర, తీపి ఉత్పత్తులు (-13.33 శాతం) ధరలు మాత్రం వార్షికంగా ఆగస్టులో చూస్తే అసలు పెరక్కపోగా క్షీణించాయి. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 25.76 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 8.37 శాతం, ప్రెపేర్డ్ మీల్స్ ధర 7.31 శాతం ఎగశాయి. మాంసం, చేపల ధర 5.79 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 5.33 శాతం, వంట నూనెల ధరలు 3.06% ఎగశాయి. పండ్ల ధరలు 1 శాతం ఎగశాయి. గుడ్ల ధర 2.30 శాతం ఎగసింది. తృణధాన్యాలు, ఉత్పత్తుల ధర 1.22 శాతం పెరిగింది. ఆల్కాహాలేతర పానీయాల ధర 4.43 శాతం పెరిగింది. నిజంగా వ్యవస్థలో ధరలు అన్నీ తక్కువగా, సామాన్యునికి అందుబాటులో ఉన్నాయా? అన్న సందేహం సహజం. తాజా గణాంకాలన్నీ బేస్ ‘ఎఫెక్ట్’ మాయ అని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. ధరలు నిజానికి గడచిన కొన్ని సంవత్సరాలు భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయని, అదే విధంగా 2014లోనూ పరిస్థితి ఇదే విధంగా తీవ్ర స్థాయిలో ఉందని వారి వాదన. అప్పటికే ఆ ధరలు సామాన్యునికి అందనంత స్థాయికి చేరి కూర్చున్నాయని, అప్పటి బేస్ ప్రాతిపదికన ఇప్పుడు ధరలు తగ్గాయనడం భావ్యం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్బీఐపైనే కళ్లన్నీ... తాజా గణాంకాల నేపథ్యంలో ఇప్పుడు పాలక వర్గాలు, ఆర్థిక వేత్తల దృష్టి అంతా ఆర్బీఐ నిర్ణయంపై పడింది. ద్రవ్యోల్బణం దిగువస్థాయిలో కొనసాగుతుందని గట్టి నమ్మకం ఏర్పడితేనే రేట్ల కోత ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తరచూ పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటికే తగ్గించిన రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా కస్టమర్లకు బదలాయించాలని సైతం సూచిస్తున్నారు. ఈ ఏడాది ఆర్బీఐ మూడుసార్లు రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనంలో 33 శాతాన్నే కస్టమర్లకు బదలాయించాయి. ఇప్పుడు దేశానికి ‘ప్రతి ద్రవ్యోల్బణ’మే ప్రధాన సవాలని ఆర్థిక శాఖ నుంచి పదేపదే చెబుతున్న సమయంలో సెప్టెంబర్ 29న రాజన్ నిర్ణయంపై ప్రస్తుతం అందరూ దృష్టి సారించారు. ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో వ్యవస్థలో పెట్టుబడులకు, డిమాండ్‌కు ఊపునివ్వడానికి ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. సెప్టెంబర్ 29న రెపో రేటును ఆర్బీఐ అరశాతం తగ్గిస్తుందని భావిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.