ఆర్‌బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం కోరుతున్నప్పటికీ... ఆర్‌బీఐ మాత్రం తగ్గించకపోవచ్చని అసోచామ్ పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును పెంచడం కారణంగా డాలరు విలువ ఎగబాకుతుండటంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోందని, దీంతో ఆర్‌బీఐ రేట్ల కోతకు ఆస్కారం తక్కువేనని అభిప్రాయపడింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు పెరగడం కూడా మరో కారణమని తెలిపింది. ‘పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) భారీగా పెరిగింది. ఇక రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు రెండూ దిగొచ్చాయి. అయితే, రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లన్నీ వచ్చిచేరితే పరిస్థితి మారిపోతుంది. మరోపక్క చక్కెర, గోదుమలు వంటి కొన్ని ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి.
అన్నింటికంటే అతిపెద్ద రిస్కు అమెరికా డాలరు బలపడుతుండటమే. వర్ధమాన దేశాల నుంచి విదేశీ నిధులు వెనక్కిపోతున్నాయి. ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తున్నాయి. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తోంది. అయితే, దీని ప్రభావం మన దేశంపై కొంత తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రూడ్ ధరల పెరగుదల మాత్రం ప్రతికూలాంశమే. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ దిగుమతిదారుగా భారత్ నిలుస్తోంది. డాలర్ బలోపేతంవల్ల తక్షణ ప్రత్యక్ష ప్రభావం చెల్లింపుల సమతుల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)పై ఉంటుంది. దీనివల్ల మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు’ అని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా పేర్కొన్నారు.
క్రూడ్ ధరల జోరు, రూపాయి విలువ క్షీణత... మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రతికూలాంశాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇక డీమోనిటైజేషన్ ప్రభావంతో జీడీపీ వృద్ధి రేటు కూడా మందగించే రిస్కు ఉందన్నారు. కీలకమైన వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుపై అనిశ్చితి నెలకొందని చెప్పారు. అయినా కూడా పారిశ్రామిక రంగం మాత్రం వడ్డీ రేట్లు తగ్గాలనే కోరుకుంటోందని.. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆర్‌బీఐ రేట్ల కోతకు ఏమాత్రం సానుకూలంగా లేవని కనోరియా చెప్పారు. తాజా పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను(రెపో రేటు) యథాతథంగా కొనసాగిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లిక్విడిటీ భారీగా పెరిగిన నేపథ్యంలో రెపో రేటును కనీసం పావు శాతమైనా తగ్గిస్తుందని అధికశాతం విశ్లేషకులు అంచనా వేశారు.