ప్రతి ద్రవ్యోల్బణంలోనే..
వరుసగా 10వ నెలలోనూ క్షీణించిన టోకు ధరల రేటు
- ఆగస్టులో మైనస్ (-) 4.95 శాతం
- ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.66 శాతంగా నమోదు
- రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలే
- ఆర్‌బీఐ రేటు కోతపై పెరిగిన ఆశలు..
న్యూఢిల్లీ: చౌక కమోడిటీల కారణంగా టోకు ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టస్థాయికి పడిపోయింది. వరుసగా 10వ నెల ఆగస్టులోనూ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా ‘మైనస్’ (ప్రతి)లో నిలిచింది. ప్రతి ద్రవ్యోల్బణం రేటు -4.95 శాతంగా ఉంది. అంటే గత ఏడాది ఆగస్టుతో పోల్చితే 2015 ఆగస్టులో టోకు ధరల బాస్కెట్ ఉత్పత్తుల ధర అసలు పెరక్కపోగా, అప్పటి ధరతో పోల్చితే 4.95 శాతం క్షీణించిందన్నమాట. ఇది చరిత్రాత్మక రికార్డు. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కూడా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో 3.66 శాతంగా నమోదయ్యింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి రేటు కోతకు డిమాండ్ తీవ్రమవుతోంది.
టోకున... మూడు విభాగాలూ...
టోకు ద్రవ్యోల్బణం గత ఏడాది ఆగస్టులో 3.85 శాతం. సూచీలోని మూడు విభాగాలూ అప్పట్లో ద్రవ్యోల్బణం పెరుగుదలనే నమోదుచేసుకున్నాయి. అయితే గడచిన 10 నెలల నుంచీ ఈ సూచీ క్షీణతలోకి జారిపోయింది. వార్షికంగా మూడు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ విభాగాలతో కూడిన ఈ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం రేటు -3.71 శాతం. 2014 ఆగస్టులో ఈ రేటు 3.69 శాతం. ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూసుకుంటే ఆ విభాగంలో రేటు 5.11 శాతం నుంచి -1.13 శాతానికి పడిపోయింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు 4.29 శాతం నుంచి -0.69 శాతానికి దిగింది.
ఫ్యూయెల్, పవర్: 4.54 శాతం రేటు -16.50 శాతానికి దిగింది.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం -1.92 శాతంగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ రేటు 3.65 శాతం.
రిటైల్ ‘ద్రవ్యోల్బణం’ మరింత కిందకు...
రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో మరింతగా కిందకుదిగి 3.66 శాతానికి పడింది. 2014 ఆగస్టు నెలలో ఈ రేటు 7.8 శాతం. కాగా, సవరించిన గణాంకాల ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతం. ఇందులో ముఖ్యమైన ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...
ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.92 శాతంగా ఉంది. కూరగాయలు (-6.36 శాతం), చక్కెర, తీపి ఉత్పత్తులు (-13.33 శాతం) ధరలు మాత్రం వార్షికంగా ఆగస్టులో చూస్తే అసలు పెరక్కపోగా క్షీణించాయి. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 25.76 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 8.37 శాతం, ప్రెపేర్డ్ మీల్స్ ధర 7.31 శాతం ఎగశాయి. మాంసం, చేపల ధర 5.79 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 5.33 శాతం, వంట నూనెల ధరలు 3.06% ఎగశాయి. పండ్ల ధరలు 1 శాతం ఎగశాయి. గుడ్ల ధర 2.30 శాతం ఎగసింది. తృణధాన్యాలు, ఉత్పత్తుల ధర 1.22 శాతం పెరిగింది. ఆల్కాహాలేతర పానీయాల ధర 4.43 శాతం పెరిగింది.
నిజంగా వ్యవస్థలో ధరలు అన్నీ తక్కువగా, సామాన్యునికి అందుబాటులో ఉన్నాయా? అన్న సందేహం సహజం. తాజా గణాంకాలన్నీ బేస్ ‘ఎఫెక్ట్’ మాయ అని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. ధరలు నిజానికి గడచిన కొన్ని సంవత్సరాలు భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయని, అదే విధంగా 2014లోనూ పరిస్థితి ఇదే విధంగా తీవ్ర స్థాయిలో ఉందని వారి వాదన. అప్పటికే ఆ ధరలు సామాన్యునికి అందనంత స్థాయికి చేరి కూర్చున్నాయని, అప్పటి బేస్ ప్రాతిపదికన ఇప్పుడు ధరలు తగ్గాయనడం భావ్యం కాదని పలువురు విమర్శిస్తున్నారు.
ఆర్‌బీఐపైనే కళ్లన్నీ...
తాజా గణాంకాల నేపథ్యంలో ఇప్పుడు పాలక వర్గాలు, ఆర్థిక వేత్తల దృష్టి అంతా ఆర్‌బీఐ నిర్ణయంపై పడింది. ద్రవ్యోల్బణం దిగువస్థాయిలో కొనసాగుతుందని గట్టి నమ్మకం ఏర్పడితేనే రేట్ల కోత ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తరచూ పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటికే తగ్గించిన రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా కస్టమర్లకు బదలాయించాలని సైతం సూచిస్తున్నారు.
ఈ ఏడాది ఆర్‌బీఐ మూడుసార్లు రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనంలో 33 శాతాన్నే కస్టమర్లకు బదలాయించాయి. ఇప్పుడు దేశానికి ‘ప్రతి ద్రవ్యోల్బణ’మే ప్రధాన సవాలని ఆర్థిక శాఖ నుంచి పదేపదే చెబుతున్న సమయంలో సెప్టెంబర్ 29న రాజన్ నిర్ణయంపై ప్రస్తుతం అందరూ దృష్టి సారించారు. ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో వ్యవస్థలో పెట్టుబడులకు, డిమాండ్‌కు ఊపునివ్వడానికి ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. సెప్టెంబర్ 29న రెపో రేటును ఆర్‌బీఐ అరశాతం తగ్గిస్తుందని భావిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.