అనారోగ్య కారణాలతో ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా? | RBI governor Urjit Patel could resign on November 19: Report | Sakshi
Sakshi News home page

అనారోగ్య కారణాలతో ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా?

Published Thu, Nov 8 2018 11:28 AM | Last Updated on Thu, Nov 8 2018 2:12 PM

RBI governor Urjit Patel could resign on November 19: Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది వారాలుగా  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కేంద్రం మద్య రగులుతున్న వివాదం సమసిపోయే లక్షణాలు కనిపించడంలేదు.  తాజా అంచనాల  ప్రకారం ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి  ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది.  ప్రభుత్వంతో  భిన్నాభిప్రాయాల నేపథ్యం తన ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపనుందన్నకారణంతో ఆయన త్వరలోనే రాజీనామా చేయనున్నారని  ఊహాగానాలు వెలువడుతున్నాయి. తదుపరి బోర్డు సమావేశంలో ఉర్జిత్‌  పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
 

నవంబరు 19న జరగనున్న ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో అనారోగ్య కారణాల రీత్యా ఆయన తప్పుకోనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు ఊర్జిత్ పటేల్ రాజీనామా నిర్ణయం వాస్తవ రూపం దాలిస్తే, అటు డిప్యూటీ గవర్నర్‌ విరాల్ ఆచార్య కూడా అదే బాటలో పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారట.  ముఖ్యంగా రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గవర్నర్ ఊర్జిత్ పటేల్ మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. 

దీనికితోడు ఆర్‌బీఐ గవర్నర్ ఆర్ధిక ప్రాధాన్యతలను గుర్తించి, కేంద్రం ప్రతిపాదనలను ఆమోదించాలని, దీనిపై బోర్డు సభ్యులతో చర్చించాలని కోరుతున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉర్జిత్‌పటేల్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటే,  ఆయన తప్పుకోవడమే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు.  దీంతో  ఉర్జిత్‌ రాజీనామా ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

అయితే రానున్నఎన్నికలకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ ఉన్నతాధికారులిద్దరు రాజీనామా చేయడం ప్రభుత్వానికి  భారీ ఎదురుదెబ్బేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆలోచిస్తోంటే, కేంద్రం  స్వల్పకాలిక పరిష్కారాలను అన్వేషిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు భానుమూర్తి పేర్కొన్నారు. అయితే విభేదాలున్నప్పటికీ, ఇద్దరూ వారి భేదాలను పరిష్కరించకోదగినవే అన్నారు. కానీ ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేయవలసి వస్తే మాత్రం  అది ఆర్ధిక వ్యవస్థకు ముప్పేనని వ్యాఖ్యానించారు.


కాగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తికి ఎదురవుతున్న సవాళ్లపై  చేసిన సంచలన వ్యాఖ్యలతో కేంద‍్రం, రిజర్వ్‌బ్యాంకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఆర్‌బీఐ గవర్నర్‌ పదవినుంచి తప్పుకోన్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆర్థికశాఖ స్పందించింది. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతామంటూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు  ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఈ వివాదంపై తొలిసారిగా  స్పందిస్తూ ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిందేనంటూ బహిరంగంగా ఆర్‌బీఐకి మద్దతు పలికారు. సీటు బెల్టులాంటి ఆర్‌బీఐని వాహనదారుడైన ప్రభుత్వం ధరించకపోతే ప్రమాదం చాలా తీవ్రంగానే ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement