వచ్చే నెలలోనే కొత్త రూ.200నోట్లు
న్యూఢిల్లీ: చిల్లరకష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్‌ఇండియా చర్యలకు దిగాయి. ప్రధనంగా పెద్ద నోట్ల రద్దు. ఆ తరువాత చలామణిలోకి వచ్చిన రూ. 2వేల నోటు కరెన్సీ లభ్యత గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రూ. 200 నోటును అందుబాటులోకి తీసుకురానుంది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నెలలోనే వీటిని విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
మైసూర్‌లోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ రూ. 200 రూపాయల నోట్లను ఇప్పటికే ప్రింటింగ్ మొదలుపెట్టిందని, ముద్రణ ప్రక్రియ పూర్తి కావడానికి 21రోజులు పడుతుందని ప్రభుత్వ పెట్టుబడి, కరెన్సీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలోనే 200 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలన్న డెడ్ లైన్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అత్యధిక భద్రతా ఫీచర్లతో వివిధ స్థాయిల్లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుంది. ఆర్‌బీఐకు చెందిన భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని మైసూర్, సల్బోని నుండి వాటిని ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం.
ఎస్‌బీ నివేదిక ప్రకారం, బ్యాంకుల వద్ద కరెన్సీ సర్క్యులేషన్ 5.4 శాతానికి తగ్గింది. నోట్ల రద్దుకు ముందు ఇది 23.19శాతంగా ఉంది. దీంతో కొత్త నోట్లు ప్రవేశంతో డిమాండ్ , సరఫరా గ్యాప్ ను తగ్గించటానికి సహాయం చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.
కాగా చిల్లర కష్టాలను అధిగమించడానికి కొత్త రూ.200 నోటును తీసుకురావాలని మార్చి నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే నకిలీలను నిరోధించడానికి గాను కొత్త కరెన్సీలో అదనపు భద్రతా పొరను జోడించాలని ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.