ఆర్బీఐ
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలన్నింటినీ బేస్ రేటు నుంచి ఎంసీఎల్‌ఆర్‌కి అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్‌ఆర్) సిస్టమ్‌ను ఆర్‌బీఐ 2016 ఏప్రిల్ 1 నుంచే తీసుకొచ్చింది. బేస్ రేటు పాలనలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ ఎంసీఎల్‌ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బేస్ రేటుతో లింక్ అయి ఉన్న రుణాలు, ఇతర క్రెడిట్ ఎక్స్‌పోజర్స్‌లు ఎంసీఎల్‌ఆర్ విధానంలోకి మార్చనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా బ్యాంకు రుణాలు బేస్ రేటుతోనే లింక్ అయి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.
ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించిన్నప్పటికీ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించడం లేదని, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడానికి సమయం తీసుకుంటున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. అంతేకాక ఆర్‌బీఐ బెంచ్‌మార్కు రేట్ల తగ్గింపుకు అనుగుణంగా లెండింగ్ రేట్ల తగ్గింపు ఉండటం లేదని తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వస్తుండటంతో, ఈ ఎంసీఎల్‌ఆర్ సిస్టమ్‌ను ఆర్‌బీఐ తీసుకొచ్చింది. రుణాల బేస్ రేటును ఎంసీఎల్‌ఆర్‌కి అనుసంధానం చేయాలని కూడా నేడు ప్రకటించింది. ఎంసీఎల్‌ఆర్ మోడ్‌లో బ్యాంకులు అర్థరాత్రి, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల రేట్లను ప్రతి నెలా సమీక్షించే, ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో త్వరితగతిన కీలక వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు చేరుతాయి. బేస్ రేటు కన్నా ఈ ఎంసీఎల్‌ఆర్ విధానంలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment