ముంబై: ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బాసటగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఉపయోగించని సెక్షన్ 7 ద్వారా తన నిర్ణయాలను ఆర్‌బీఐపై రుద్దే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. ఈ నెల 19న జరిగే ఆర్‌బీఐ భేటీ సందర్భంగా ఆర్‌బీఐ, ప్రభుత్వం తమ మధ్య దూరాన్ని తొలగించుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెక్షన్ 7ను ప్రభుత్వం ప్రయోగిస్తే, గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాలకే కట్టుబడి ఉంటే విషయం వెడెక్కుతుంది. ఆర్‌బీఐ లేదా ఉర్జిత్ పటేల్ కూడా తమ వాదనకే కట్టుబడి ఉంటే, ప్రభుత్వం సెక్షన్ 7ను ప్రయోగించినట్టయితే... పటేల్ రాజీనామా చేస్తారని అనుకుంటున్నా’’ అని రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జమ్నాలాల్ బజాజ్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రభుత్వం–ఆర్‌బీఐ మధ్య వివాదం మంచిది కాదు
ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు మధ్య వివాదం మంచిది కాదని ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అన్నారు. పలు అంశాలపై ఇటీవల కేంద్రం, ఆర్‌బీఐ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మొండి బకాయిల విషయంలో ప్రొవిజన్లకు సంబంధించి కఠిన నిబంధనలను బ్యాంకులపై రుద్దడం వల్ల బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బేసెల్ క్యాపిటల్ అడెక్వెసీ నిబంధనల్లో పేర్కొన్న పరిధికి మించి భారత్ వెళ్లకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment