పెద్ద యూసీబీలను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చండి
ఆర్‌బీఐ ప్యానెల్ సిఫార్సు
ముంబై : దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనువుగా పెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను (యూసీబీ) రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాల్సిన అవసరముందని ఆర్‌బీఐ ప్యానెల్ పేర్కొంది. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాలని ఆర్‌బీఐ ప్యానెల్ సిఫార్సు చేసింది. వీటి వ్యాపార పరిమాణం కనీసం రూ.20,000 కోట్లుగా ఉండాలని సూచించింది. ‘పెద్ద మల్టీ-స్టేట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉంటాయి. ఫారెక్స్, మనీ మార్కెట్, పేమెంట్ సిస్టమ్స్ వంటి తదితర కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి.
ఒకవేళ అవి విఫలమైతే దాని ప్రభావం మొత్తం యూసీబీ రంగంపై ఉంటుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చితే సరిపోతుంది’ అని వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా యూసీబీలను చిన్న బ్యాంకులుగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలని మాత్రమే ప్రతిపాదించామని, అంతేకానీ వాణిజ్య బ్యాంకులు అందించే అన్ని సేవలను యూసీబీలు కూడా అందించటానికి ప్యానెల్ సమ్మతించలేదు. రూ.20,000 కోట్లకు తక్కువ వ్యాపార పరిమాణం కలిగిన చిన్న యూసీబీలు చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులుగా మారాలని భావిస్తే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మూసివేత, విలీనం వంటి అంశాల వల్ల 2008 మార్చి చివరకు 1,770గా ఉన్న యూసీబీల సంఖ్య ఈ ఏడాది మార్చి చివరకు 1,579గా ఉంది.