పేమెంట్స్‌ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు! | Airtel Payments Bank CEO Anubrata Biswas Said Bright Future For Payments Banks, Details Inside | Sakshi
Sakshi News home page

పేమెంట్స్‌ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!

Published Mon, May 6 2024 9:38 AM

పేమెంట్స్‌ బ్యాంకులకు గుడ్‌ న్యూస్‌..

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈవో బిశ్వాస్‌

న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్‌ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈవో అనుబ్రత బిశ్వాస్‌ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్‌ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.

డిజిటల్‌ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్‌ వివరించారు. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ మార్కెట్‌ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్‌ యూజర్లు, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్‌ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్‌ పేర్కొన్నారు.

తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్‌ పాయింట్స్‌ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు..

Advertisement
Advertisement