
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలకు యస్ బ్యాంక్ బుధవారం ఈ విషయాలను తెలియజేసింది. ‘యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుడిని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది‘ అని వివరించింది. దాదాపు రూ.10,000 కోట్ల మేర మొండిబాకీలను పద్దుల్లో సరిగ్గా చూపలేదని ఆడిట్‌లో తేలిన నేపథ్యంలో మరో విడత సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇదివరకే నిరాకరించిన సంగతి తెలిసిందే.
మూడేళ్ల పదవీకాలాన్ని 2019 జనవరి 31 దాకా ఆర్‌బీఐ కుదించింది. అప్పటికల్లా కొత్త సీఈవోను నియమించాలంటూ ఆదేశించింది. దీంతో కొత్త సీఈవో అన్వేషణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన బ్యాంక్.. కపూర్ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది. ఈ ప్రతిపాదననే ఆర్‌బీఐ తాజాగా తోసిపుచ్చింది. 2004లో యస్ బ్యాంక్ ప్రారంభమైనప్పట్నుంచీ రాణా కపూర్ ఎండీ, సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయనకు బ్యాంక్‌లో 10.66 శాతం వాటాలు ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేరు 6.85 శాతం క్షీణించి రూ. 231.75 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment