మూడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా!
♦ కేవైసీ, ఏఎంఎల్ నిబంధనలు పాటించని ఫలితం
♦ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రూ.2 కోట్ల జరిమానా
♦ బీఓబీకి రూ.5 కోట్లు, పీఎన్‌బీకి రూ.3 కోట్లు
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీ స్థాయిలో జరిమానాలు విధించింది. యాంటీ మనీలాండరింగ్(ఏఎంఎల్) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు, నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబంధనలను సరిగ్గా పాటించనందుకు ఆర్‌బీఐ ఈ జరిమానాలు వడ్డించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.5 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రూ.3 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రూ. 2 కోట్ల చొప్పున ఆర్‌బీఐ జరిమానా విధించిందని ఆయా బ్యాంక్‌లు బీఎస్‌ఈకి నివేదించాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్‌లో గత ఏడాది అక్టోబర్‌లో రూ.6,100 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. యాంటీ మనీలాండరింగ్ నిబంధనలకు సంబంధించి అంతర్గత నియంత్రణ వ్యవస్థ విఫలమైందని, అందుకే ఈ స్కామ్ చోటు చేసుకుందని బీఓబీ అంగీకరించింది. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. అనుమానాస్పద లావాదేవీల నివేదికలు(ఎస్‌టీఆర్-సస్పీసీయస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్)లు సమర్పించకపోవడం, సరై కేవైసీ పత్రాలు లేకుండా వివిధ సంస్థలకు ఖాతాలు ప్రారంభించే వెసులుబాటు కల్పించడం.. తదితర అవకతవకలను బీఓబీ లావాదేవీల్లో ఆర్‌బీఐ గుర్తించింది. రూ.5 కోట్ల జరిమానా వడ్డించింది.
పెద్ద విషయం కాదు..
కాగా తమ బ్యాంక్ వ్యాపారం రీత్యా రూ.3 కోట్ల జరిమానా పెద్ద విషయం కాదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్‌లకు నివేదించామని తెలిపింది. భవిష్యత్తులో ఏఎంఎల్, కేవైసీ నిబంధనల ఉల్లంఘన జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని పీఎన్‌బీ భరోసానిచ్చింది. రెమిటెన్సెస్‌లో పలు అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఒక షోకాజ్ నోటీస్‌ను జారీ చేసింది. దీనికి సమాధానంగా హెచ్‌డీఎఫ్‌సీ సమర్పించిన సవివర నివేదికను మదింపు చేసింది. కేవైసీ, యాంటీ మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ హెచ్‌డీఎఫ్‌సీపై రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఇలాంటివి జరగకుండా తమ విధానాలను సమీక్షించుకుని, తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ అన్ని వాణిజ్య బ్యాంకులనూ కోరింది.