ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ రేటులో రావాలి. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు రావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువుగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
⇒ కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతేకాదు స్థిరాస్తి మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలా మంది డాబా ఇల్లా? ఫ్లాటా? అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు? లేదంటే స్థలాలనా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్తికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్‌కి ఉంటుంది కానీ స్థలాన్నో, ఇంటినో అమ్ముకోవాలనే వారికెందుకనే భావన చాలామందికి ఉంటుంది. కానీ, మార్కెట్ గురించి తెలుసుకోవటం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికి వాస్తవమైన రేటు, అమ్మే రేటు ఎంతో తెలుస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాస్తి ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట.
⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.
⇒ స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం ఏ చిన్న పొరపాటు ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి.