7,97,623 : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూన్ వరకు అమ్మకాలకు నోచుకోని ఇళ్లు
4,13,000 : వీటిల్లో మధ్యతరగతి వర్గాల కోసం సరసమైన ధరల్లో ఉన్న ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రండి బాబు.. రండి... సరసమైన ధరల్లో ఇళ్లు కావాలా.. వెంటనే సంప్రదించండి.. అంటూ నిర్మాణసంస్థలు కొనుగోలుదారుల వెంట పడాల్సి వస్తోంది. స్థిరాస్తిరంగం ఊపు మీదున్నా.. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం మాత్రం మందకొడిగా నడుస్తోంది. ప్లాట్‌ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా.. ఫ్లాట్‌ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా, రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉంది. అయితే ఇక్కడ కూడా కాంక్రీట్ నిర్మాణాల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. భూముల విలువలు నింగినంటడం, ముమ్మర నిర్మాణాలు, నిర్మాణ వ్యయం పెరగడంతో విల్లాలు, ఫ్లాట్‌ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో వృద్ధి తగ్గింది. ప్రాప్ టైగర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సర్వే ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల తాకిడితో రాజధాని పరిసర ప్రాంతం రియల్ రంగానికి చోదకశక్తిగా మారింది. ఇతర మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్‌తోపాటు చదరపు అడుగు ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితి మన దగ్గర తక్కువ కాబట్టి అమ్ముడుకాని ఇండ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేంద్ర బడ్జెట్‌లో గృహ రుణాల వడ్డీ తగ్గింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం వల్ల ఇళ్ల ఖరీదు ఊపందుకుంటుందని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం నిలకడ కనిపిస్తోంది.
నేల చూపులు.. నింగిలో ధరలు
రెరా చట్టం అమలు.. నిర్మాణ వ్యయం పెరగడం.. డెవలప్‌మెంట్‌లో భూ యజమానికి ఇచ్చే నిష్పత్తి శాతం పెరగడం కూడా ఫ్లాట్‌ల ధరలు అనూహ్యంగా పెరగడానికి కారణం. భూయజమానికి లెక్కకు మించి ఫ్లాట్లు ఇవ్వాల్సి రావడం, గుడ్‌విల్ కూడా చెల్లించాల్సి రావడంతో ఫ్లాట్ల ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు తగిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా అమ్మకాలు జరగడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలోనూ పెరుగుదల వస్తోంది. ఈ కారణాలన్నింటితో సదరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల ధరలు క్రమేణా పెంచాల్సి వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోందన్నది ఓ ప్రముఖ బిల్డర్ అభిప్రాయం. గతంతో పోలిస్తే కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థ గురించి వాకబు చేస్తున్నారు. అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్‌ల నాణ్యత, సమయానికి ఇస్తారా.. లేదా.. వంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే కొనేందుకు ముందుకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు కడుతున్నారా.. లేదా.. తెలుసుకున్న అనంతరం అడుగు వేస్తున్నారు. ఈ మార్పులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని బిల్డర్లు చెపుతున్నారు. దీంతో పాటు బడా బడా సంస్థలు స్థిరాస్తి వ్యాపారంలోకి రావడంతో భూముల విలువలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు లాభాపేక్షతో ధరలు పెంచేయడం.. సౌకర్యాలకు తగ్గట్టుగా చదరపు అడుగుల చొప్పున ధరలను నిర్దేశించడంతో ఫ్లాట్‌లు అందుబాటులో లేకుండాపోయాయి. దీనికితోడు గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మేడ్చల్, కొంపల్లి, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, నెక్నాంపూర్, మణికొండ, హైదర్షాకోట్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల తాకిడితో టెకీలు వ్యయం ఎక్కువైనా ఫ్లాట్‌ల కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో గేటెడ్ కమ్యూనిటీ, బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లో విల్లాలను కొనేందుకు సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మాత్రం వాటిని అమ్మడం బిల్డర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇక, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాలు, అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గిపోవడం గమనార్హం.
ఇళ్ల స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలు డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్‌లు కొనడానికి ఆసక్తి చూపడంలేదు. విల్లాలు, ఫ్లాట్‌ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో కొనుగోలుదారులు స్థలాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఆసాధారణంగా పెరిగిన ధరలు రియల్ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తుండటంతో నల్లధనం కూడా వెల్లువలా వస్తోంది. దీంతో భూముల విలువలు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆషాఢమాసంలో రూ.500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారాప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంటే అంతా స్థలాలు, సాగు భూముల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మందగించినా.. ట్రెండ్ మారుతోంది: రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు
గ్రేటర్‌హైదరాబాద్‌లో నిర్మాణ రంగం శరవేగంగా పురోగమించడంతోపాటు స్థిరంగా వృద్ధిరేటు సాధిస్తోంది. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మందగించినప్పటికీ ఇప్పడు ట్రెండ్ మారుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలతో పలు ప్రముఖ సంస్థలు నగరం వైపు దృష్టిసారించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ ఫ్లాట్ల ధరలు నగరంలోనే అందుబాటు ధరల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment