జోరు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగానికి మళ్లీ గడ్డుకాలం వచ్చింది. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణరంగాన్ని ఇప్పుడు రాజకీయ అనిశ్చితి, ఎన్నికలు, కనికరించని బ్యాంకులు చుట్టుముట్టాయి. దీంతో తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడింది. రాష్ర్ట వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. గతేడాది రూ.6,588.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈ ఏడాది రూ.5,034.30 కోట్లను గడించింది. అంటే 23.59 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించిందని రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.
ప్రత్యేక రాష్ట్ర ప్రకటన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేయగా, ఆర్థిక లోటు, రాజధాని ప్రకటనపై నెలకొన్న అనిశ్చితి సీమాంధ్రలో స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పెపైచ్చు ఎన్నికల ప్రభావమూ ఉండనే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చాక ఫ్లాట్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
మార్చి నెలలో మా సంస్థలో కేవలం 16 బుకింగ్స్‌తో రూ. 12 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేసిందని పేర్కొన్నారు. నగరీకరణ శరవేగంగా జరుగుతుండటంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఏడాదిన్నరగా ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. అదే క్రమంలో బడా కంపెనీలు కూడా రాష్ట్రానికి తరలిరావడంతో శివార్లలో కూడా బడా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొచ్చాయి. దీంతో గతేడాది జూలై రెండోవారం వరకు కూడా రిజిస్ట్రేషన్లు జోరుగానే సాగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలివే..
రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే గుర్తొచ్చేవి హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలే. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది.
గతేడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్‌లో 30.54 శాతం, హైదరాబాద్ దక్షిణంలో 6.33 శాతం అదేవిధంగా రంగారెడ్డిలో 21.24 శాతం, రంగారెడ్డి తూర్పులో 27.45 శాతం ఆదాయం తక్కువ వచ్చింది.
ఇక సీమాంధ్ర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే విశాఖపట్నంలో 26.03 శాతం, విజయవాడలో 23.39 శాతం, విజయవాడ తూర్పులో 27.33 శాతం అదేవిధంగా చిత్తూరులో 26.26 శాతం ఆదాయం తక్కువగా వచ్చింది.