
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2017–18, క్యూ2)లో కంపెనీ రూ.8,109 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,209 కోట్లతో పోలిస్తే 12.5 శాతం ఎగబాకింది.
ఇక మొత్తం ఆదాయం సైతం 81,651 కోట్ల నుంచి రూ.1,01,169 కోట్లకు దూసుకెళ్లింది. 23.9 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ వ్యాపారాల మెరుగైన పనితీరుతో పాటు రిలయన్స్ జియో టెలికం వ్యాపారం నిర్వహణపరమైన లాభాల్లోకి రావడం రిలయన్స్ లాభాల జోరుకు దోహదం చేసింది.
సీక్వెన్షియల్‌గా చూస్తే..: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.9,079 కోట్లతో పోల్చిచూస్తే... సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 10.8 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం క్యూ1తో పోలిస్తే 11.7 శాతం వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో రిలయన్స్ లాభం రూ.8,169 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.
దాదాపు ఇదే స్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. ఇక కంపెనీ నిర్వహణ లాభం అంచనాలను మించి రూ.15,567 కోట్లుగా, మార్జిన్లు 16.4 శాతంగా నమోదవడం గమనార్హం. విశ్లేషకులు రూ.13,178 కోట్ల నిర్వహణ లాభాన్ని, 15.5 శాతం మార్జిన్లను అంచనా వేశారు.
రిఫైనింగ్ మార్జిన్లు.. తొమ్మిదేళ్ల గరిష్టం
సెప్టెంబర్ క్వార్టర్‌లో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) 12 డాలర్లుగా నమోదైంది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టస్థాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 10.1 డాలర్లుగా, ఈ ఏడాది క్యూ1(జూన్ క్వార్టర్)లో 11.9 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇒ క్యూ2లో పెట్రోకెమికల్స్ విభాగం ఆదాయం రూ.27,999 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.22,422 కోట్లతో పోలిస్తే 25% ఎగసింది. స్థూల లాభం రూ.3,417 కోట్ల నుంచి రూ.4,960 కోట్లకు ఎగబాకింది. 45 శాతం వృద్ధి చెందింది.
⇒ ఇక రిఫైనింగ్ ఆదాయం 15.3 శాతం ఎగసి రూ.60,527 కోట్ల నుంచి రూ.69,766 కోట్లకు పెరిగింది. స్థూల లాభం రూ.5,975 కోట్ల నుంచి రూ.6,621 కోట్లకు చేరింది. 10.8% వృద్ధి చెందింది.
⇒ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం ఆదాయం 13.3 శాతం వృద్ధితో రూ.1,327 కోట్ల నుంచి రూ.1,503 కోట్లకు పెరిగింది. స్థూల నష్టం రూ.491 కోట్ల నుంచి రూ.272 కోట్లకు తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా కోల్‌బెడ్ మీథేన్(సీబీఎం) గ్యాస్ ఉత్పత్తి జోరందుకోవడం దీనికి దోహదం చేసింది.
⇒ రిటైల్ వ్యాపార విభాగం ఆదాయం రూ.8,079 కోట్ల నుంచి రూ.14,646 కోట్లకు ఎగసింది. 81% వృద్ధి చెందింది. ఈ వ్యాపారానికి సంబంధించి స్థూల లాభం కూడా 68.2 శాతం వృద్ధితో రూ.264 కోట్ల నుంచి రూ.444 కోట్లకు పెరిగింది.. సెప్టెంబర్ చివరికి రిలయన్స్ రిటైల్ 750 నగరాలు, పట్టణాల్లో 3,679 స్టోర్లను నిర్వహిస్తోంది. క్యూ2లో కొత్తగా 45 స్టోర్లు జతయ్యాయి.
⇒ సెప్టెంబర్ ఆఖరికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.2,14,145 కోట్లుగా నమోదైంది. కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.77,014 కోట్లు.
⇒ శుక్రవారం స్టాక్ మార్కెట్ జోరుకు అనుగుణంగానే రిలయన్స్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని(రూ.891) తాకింది. చివరకు అర శాతం లాభంతో రూ.877 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.
జియో జోష్...
రిలయన్స్ జియో వాణిజ్యపరంగా 4జీ సేవలను ఆరంభించినట్లు (బిల్లింగ్‌ను మొదలుపెట్టడం) ప్రకటించిన తొలి త్రైమాసికంలోనే అదరగొట్టే పనితీరును నమోదుచేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,147 కోట్లకు చేరింది. స్థూల లాభం 23.5 శాతం వృద్ధితో రూ.1,442 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ లాభం రూ.260 కోట్లుగా నమోదైంది.
నికర నష్టం మాత్రం రూ.21.3 కోట్ల(క్యూ1) నుంచి క్యూ2లో రూ.271 కోట్లకు పెరిగింది. క్యూ2లో సగటున కంపెనీకి ఒక్కో యూజర్ నుంచి రూ.156 చొప్పున ఆదాయం(ఏఆర్‌పీయూ) లభించింది. ఇది చాలా సానుకూలాంశమని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరినాటికి జియో నెట్‌వర్క్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 13.86 కోట్లుగా ఉంది. క్యూ2లో నికరంగా 1.53 కోట్ల మంది యూజర్లు జతయినట్లు కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ సెప్టెంబర్ క్వార్టర్‌లో కూడా పటిష్టమైన పనితీరును సాధించింది. వాణిజ్యపరంగా కార్యకలాపాలు ఆరంభించిన తొలి త్రైమాసికంలోనే రిలయన్స్ జియో అత్యంత సానుకూల స్థూల లాభాన్ని ఆర్జించగలిగింది. సరైన వ్యాపార వ్యూహంతో పాటు అధునాతన 4జీ టెక్నాలజీలో పెట్టుబడుల కారణంగా జియో శుభారంభం చేసింది. ఇక పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ వ్యాపారాలు ఎప్పటిలాగానే బలమైన వృద్ధితో దూసుకెళ్తున్నాయి. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment