ముకేశ్‌.. మెగా డీల్స్‌! | Reliance Industries 42nd Annual general meeting | Sakshi
Sakshi News home page

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

Published Tue, Aug 13 2019 5:24 AM | Last Updated on Wed, Sep 4 2019 4:59 PM

Reliance Industries 42nd Annual general meeting - Sakshi

భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్‌తో కలిసి ఏజీఎంకు హాజరైన ముకేశ్‌ అంబానీ

చమురు నుంచి టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరిన్ని భారీ వ్యాపార ప్రణాళికలు ప్రకటించింది. ఏడాదిన్నర వ్యవధిలో రుణ రహిత సంస్థగా మారాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1.15 లక్షల కోట్ల భారీ డీల్స్‌ ప్రకటించింది. అలాగే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫైబర్‌ సర్వీసులను కూడా వచ్చే నెల నుంచే అందుబాటులో తేనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు పలు వ్యాపార వ్యూహాలు ఆవిష్కరించింది.   

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశ (ఏజీఎం) వేదికపై సంస్థ అధినేత ముకేశ్‌ అంబానీ భారీ వ్యాపార ప్రణాళికలను ప్రకటించారు. ఏడాదిన్నర వ్యవధిలో రుణరహిత కంపెనీగా మార్చే దిశగా పలు చర్యలను వెల్లడించారు. ప్రధానమైన పెట్రోకెమికల్‌ వ్యాపార విభాగంలో సౌదీకి చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కోకు 20 శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ విభాగం విలువను 75 బిలియన్‌ డాలర్ల కింద అంచనా వేశారు. అంటే... 20 శాతం వాటా కింద 15 బిలియన్‌ డాలర్ల వరకూ రిలయన్స్‌ చేతికి అందుతాయి.

ఇక, ఇంధనాల రిటైల్‌ వ్యాపారంలో బ్రిటన్‌ దిగ్గజం బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ) సంస్థకు 49 శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు అంబానీ చెప్పారు. ఈ డీల్‌ విలువ సుమారు రూ.7,000 కోట్లు. స్థూలంగా ఈ రెండు ఒప్పందాల ద్వారా సుమారు రూ.1,15,000 కోట్లు రిలయన్స్‌కు లభించగలవని అంచనా. ఒప్పందాల స్వరూపం ప్రకారం...  పెట్రోకెమికల్‌ వ్యాపారంలో 20 శాతం వాటా సౌదీ ఆరామ్‌కోకు దక్కుతుంది. ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌లో బీపీకి 49 శాతం వాటా దక్కుతుంది. ఆ నెట్‌వర్క్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేతిలో మిగిలే 51 శాతం వాటాలో సైతం కొంత సౌదీ ఆరామ్‌కో చేతికి వెళుతుంది.  

రోజుకు 5 లక్షల బ్యారెళ్ల సరఫరా...
ప్రపంచంలోనే అతి పెద్ద ముడిచమురు ఎగుమతిదారు అయిన ఆరామ్‌కో... జామ్‌నగర్‌ (గుజరాత్‌)లోని రిలయన్స్‌ జంట రిఫైనరీలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన రోజుకు 5,00,000 బ్యారెళ్ల చమురును సరఫరా చేయనుందని అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. రిలయన్స్‌కు ప్రస్తుతం 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 విమాన ఇంధన విక్రయ స్టేషన్లు ఉన్నాయి. బీపీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే అయిదేళ్లలో ఈ నెట్‌వర్క్‌ను 5,500 బంకుల స్థాయికి పెంచుకోవాలని ఇరు సంస్థలు నిర్దేశించుకున్నాయి. సౌదీ ఆరామ్‌కోతో డీల్‌ 2020 మార్చి నాటికి పూర్తి కాగలదని ఏజీఎం అనంతరం రిలయన్స్‌ ఈడీ పీఎంఎస్‌ ప్రసాద్‌ విలేకరులకు తెలియజేశారు. అయిదేళ్ల వ్యవధిలో పెట్రో కెమికల్స్‌ వ్యాపార విభాగాన్ని అన్‌లిస్టెడ్‌ అనుబంధ సంస్థగా విడగొట్టనున్నట్లు చెప్పారాయన.  

రూ. 2.8 లక్షల కోట్ల రుణభారం..
గడిచిన ఐదేళ్లుగా చమురు నుంచి టెలికం, రిటైల్‌ దాకా వివిధ వ్యాపార విభాగాల విస్తరణ కోసం రిలయన్స్‌ రూ.5.4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసింది. ఇందులో అధిక భాగం రుణాల రూపంలోనే ఉంది. ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ రుణ భారం రూ.2,88,243 కోట్లు కాగా... దాని చేతిలో మాత్రం రూ.1,31,710 కోట్ల నగదు నిల్వలున్నాయి. బీపీ, సౌదీ ఆరామ్‌కో సంస్థలతో డీల్స్‌తో రుణభారం కొంత వరకూ తగ్గుతుంది.

  అధిక రుణభారంతో సంస్థ వృద్ధికి విఘాతం ఏర్పడుతుందన్న పరిశ్రమ నిపుణుల అభిప్రాయాలను అంబానీ తోసిపుచ్చారు. అయితే, 18 నెలల కాలంలో మొత్తం రుణభారాన్ని తగ్గించేసుకుని అప్పుల్లేని సంస్థగా ఆవిర్భవించాలని కంపెనీ నిర్దేశించుకుంది. నగదు నిల్వల కన్నా రుణ భారం తక్కువగా ఉంటే రుణరహిత సంస్థగా పరిగణిస్తారు. టెలికం, రిటైల్‌ తదితర వ్యాపార విభాగాలన్నింటినీ కలిపితే రిలయన్స్‌ గ్రూప్‌ విలువ 134 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా.  

టాప్‌ టెల్కోగా జియో..
టెలికం విభాగం జియో యూజర్ల సంఖ్య ఈ ఏడాది జూన్‌ చివరినాటికి 34 కోట్లకు చేరినట్లు ముకేశ్‌ అంబానీ తెలిపారు. యూజర్లపరంగా దేశీయంగా అతి పెద్ద టెలికం ఆపరేటర్‌గా, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆపరేటర్‌గా (సింగిల్‌ ప్లాట్‌ఫాం) జియో ఆవిర్భవించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), గృహాలకు, ఎంటర్‌ప్రైజ్‌ కంపెనీలకు, చిన్న సంస్థలకు (ఎస్‌ఎంఈ) బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించటం ద్వారా మరింత వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఈ నాలుగు విభాగాల నుంచి ఆదాయ ఫలాలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కనిపిస్తాయన్నారు. 2020 జనవరి 1 నుంచి ఐవోటీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

స్టార్టప్స్‌కు ఊతం..
స్టార్టప్‌ సంస్థలకు తోడ్పాటునిచ్చే దిశగా వాటికి ఉచితంగా ఇంటర్నెట్‌ సేవలు అందించడంతో పాటు కొన్నింటిలో ఇన్వెస్ట్‌ కూడా చేయనున్నట్లు అంబానీ చెప్పారు. ‘జియో సంస్థ... భారత్‌లో భారతీయుల చేతిలో తయారైన స్టార్టప్‌. సాధారణంగా స్టార్టప్స్‌ వ్యయాల్లో 80 శాతం వాటా క్లౌడ్, కనెక్టివిటీ తదితర అవసరాలదే ఉంటుంది. అందుకే ఔత్సాహిక సంస్థలకు వీటిని ఉచితంగా అందించేందుకు జియో సిద్ధంగా ఉంది.

2020 జనవరి 1 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈలోగా జియోడాట్‌కామ్‌లో స్టార్టప్స్‌ ప్యాకేజీలు నమోదు చేసుకోవచ్చు.   వ్యవ సాయం, విద్య, వైద్యం, నైపుణ్యాల శిక్షణ విభాగాల స్టార్టప్స్‌  కు ప్రాధాన్యం లభిస్తుంది‘ అని అంబానీ చెప్పా రు. తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, తనయులు ఆకాశ్, అనంత్, కూతురు ఈషా, కోడలు శ్లోక కూడా  ఏజీఎంలో పాల్గొన్నారు. నవభారతం  రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో రిలయన్స్‌ కూడా కొత్త రిలయన్స్‌గా రూపాంతరం చెందుతుందని అంబానీ పేర్కొన్నారు.

రిలయన్స్‌ 42వ ఏజీఎం ముఖ్యాంశాలు...
సౌదీ ఆరామ్‌కో–ఆర్‌ఐఎల్‌ డీల్‌
► రిఫైనరీ, పెట్రోకెమికల్‌ వ్యాపారంలో 20% వాటా సౌదీ ఆరామ్‌కో చేతికి
► డీల్‌ విలువ రూ.1.05 లక్షల కోట్లు (15 బిలియన్‌ డాలర్లు)
► దీని ప్రకారం ఈ విభాగాల విలువ రూ.5,25,000 కోట్లు (75 బిలియన్‌ డాలర్లు)



బీపీ–ఆర్‌ఐఎల్‌ డీల్‌
► ఇంధన రిటైల్‌ వ్యాపా రంలో  49% వాటా బీపీ చేతికి
► డీల్‌ విలువ రూ.7,000 కోట్లు
► దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 5,500 పెట్రోలు బంకులు



రుణ రహిత కంపెనీగా...
► ఐదేళ్లలో కన్సూమర్‌ వ్యాపారాలన్నీ స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌
► రియల్టీ, ఫైనాన్షియల్‌ పెట్టుబడులను తగినవిధంగా ఉపయోగించుకోవడం
► ప్రస్తుతం కంపెనీ మొత్తం రుణ భారం : రూ.2.88 లక్షల కోట్లు
► నగదు నిల్వలు : రూ.1.32 లక్షల కోట్లు
► నికర రుణ భారం : రూ.1.56 లక్షల కోట్లు
► 18 నెలల్లో (2021, మార్చి 31 నాటికి) రుణ రహిత కంపెనీగా ఆవిర్భావం లక్ష్యం

షేరు పనితీరు గత ఐదేళ్లలో...
రిలయన్స్‌ 135% అప్‌
నిఫ్టీ: 44% అప్‌



జియో దూకుడు...
► ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ కంపెనీ
► సబ్‌స్క్రయిబర్ల సంఖ్య : 34 కోట్లు
► యూజర్ల పరంగా దేశంలో నంబర్‌ 1 టెల్కో, ప్రపంచంలో 2వ స్థానం
► జియో ఫైబర్‌ నెట్‌ వాణిజ్య సేవలు : సెప్టెంబర్‌ 5న షురూ
► కనీస బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌ : 100 ఎంబీపీఎస్‌
► టారిఫ్‌ : రూ.700 నుంచి రూ.10,000
► మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం : అజూర్‌ క్లౌడ్‌ సేవలు జియో నెట్‌వర్క్‌లో
► 2020, జనవరి 1 నుంచి ఐవోటీ సేవలు


రూ. 700కే జియో ఫైబర్‌
జియో టెలికం సర్వీసులు ప్రారంభించి మూడేళ్లవుతున్న సందర్భంగా సెప్టెంబర్‌ 5న జియో ఫైబర్‌ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు అంబానీ వెల్లడించారు. ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితకాలం పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌... కనిష్టంగా 100 ఎంబీపీఎస్‌ బ్రాండ్‌బ్యాండ్‌ స్పీడ్‌ అందించేట్లుగా ఈ సర్వీసులుంటాయి. నెలకు రూ. 700 నుంచి రూ. 10,000 దాకా ప్లాన్స్‌ ఉంటాయి. అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 అద్దెకే ల్యాండ్‌లైన్స్‌ నుంచి అపరిమిత ఇంటర్నేషనల్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్‌ రేట్లతో పోలిస్తే ఇది అయిదో వంతు నుంచి పదో వంతు దాకా తక్కువ ఉంటుందని అంబానీ తెలిపారు. ‘అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఫిక్సిడ్‌ లైన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 90 ఎంబీపీఎస్‌ మాత్రమే ఉంటోంది. కానీ మన దగ్గర జియో ఫైబర్‌ ప్రారంభ ప్లానే 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఉంటుంది. 1 జీబీపీఎస్‌ దాకా స్పీడ్‌ పొందవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. 1,600 పట్టణాల నుంచి ఇప్పటిదాకా 1.5 కోట్ల మేర రిజిస్ట్రేషన్స్‌ నమోదైనట్లు వివరించారు.  

ఫైబర్‌తో టీవీ ఉచితం
జియో ఫరెవర్‌ ప్లాన్స్‌ పేరిట ఉండే వార్షిక ప్లాన్స్‌ను ఎంచుకున్న వారికి హెచ్‌డీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ సెట్‌ కూడా ఉచితంగా అందించనున్నట్లు ముకేష్‌ అంబానీ చెప్పారు. దీంతో పాటు 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే ప్రముఖ ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) యాప్స్‌కి కూడా సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.  

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో..
సినిమాలు థియేటర్లలో రిలీజైన రోజే ఇంట్లోనే వాటిని చూసే సర్వీసు కూడా ప్రవేశపెడుతున్నట్లు అంబానీ చెప్పారు. జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పేరిట 2020 మధ్యలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రీమియం కస్టమర్లు ఈ సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్‌తో జట్టు...
కొత్తగా క్లౌడ్‌ డేటా సెంటర్స్‌ ఏర్పాటు కోసం సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు అంబానీ చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ ప్రపంచ స్థాయి డేటా సెంటర్స్‌ ఏర్పాటవుతాయని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇరు సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

షేర్‌హోల్డర్లకు మరింత విలువ..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ పెట్టుబడి (సౌదీ ఆరామ్‌కో డీల్‌). అంతే కాదు దేశంలోకి వచ్చిన అత్యంత భారీ ఎఫ్‌డీఐల్లో ఇది కూడా ఒకటి. మరోవైపు పెట్రో రిటైల్‌ వ్యాపార విభాగంలో బ్రిటన్‌ సంస్థ బీపీ 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రు.7,000 కోట్లు. వచ్చే 18 నెలల్లో.. అంటే 2021 మార్చి 31 నాటికి రుణ రహిత కంపెనీగా మారతాం. ఇందుకు సంబంధించి మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది.

ఈ లక్ష్య సాధన క్రమంలో షేర్‌హోల్డర్లయిన మీ అందరికీ.. కంపెనీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మరింత అధిక డివిడెండ్లు, మధ్య మధ్యలో బోనస్‌ ఇష్యూలు, ఇతరత్రా సాధనాల ద్వారా మరిన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీ ఇస్తున్నాను. సౌదీ ఆరామ్‌కో, బీపీతో ఒప్పందాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతాయని భావిస్తున్నాం. వీటితో రూ.1.15 లక్షల కోట్ల దాకా నిధులు అందుబాటులోకి వస్తాయి. వచ్చే అయిదేళ్లలో జియో, రిలయన్స్‌ రిటైల్‌ను ఐపీవోకి కూడా తెస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచే జియోఫైబర్‌ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఐదేళ్లు ఏటా 15 శాతం వృద్ధి సాధించగలం.  
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ


ఎంఆర్‌ హెడ్‌సెట్‌తో జియో సేవలను వివరిస్తున్న ఆకాశ్‌ అంబానీ, ఈషా అంబానీ, ఏజీఎంకు హాజరైన అనంత్‌ అంబానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement