సాక్షి, ముంబై : టెలికాం యూజర్ల గణాంకాల్లో విచ్రిత పరిణామం చేసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్ జియో, ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రమే అక్టోబర్ నెలలో నూతన వినియోగదారులను ఆకర్షించాయి. మిగిలిన టెల్కోలు, భారతి ఎయిర్‌టెల్ వోడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) చతికిల పడ్డాయి.
ముఖ్యంగా జియో, బీఎస్‌ఎన్‌ఎల్ కలిపి కోటికిపైగా కొత్త కస్టమర్లను సాధించగా, మిగిలిన టెలికాం సంస్థలకు కోటికిగా పైగా కస్టమర్లను కోల్పోయాయి. ముఖ్యంగా జియో ఒక్కటే ఏకంగా కోటిమంది కస‍్టమర్లను తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. దీంతో జియో మొత్తం కనెక్షన్ల సంఖ్య 26.28కోట్లకు చేరిందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా 3,63,991మంది చేర్చుకుని మొత్తం చందాదారుల సంఖ్య 11.34 కోట్లకు చేరింది.
2018,అక్టోబర్ నెలకు సంబంధించి ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం వినియోగదారుల సంఖ్య నామ మాత్రంగా పుంజుకుని 119.2 కోట్లకు చేరింది. ఇందులో రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ కలిసి 1.08 కోట్ల కొత్త మొబైల్ ఫోన్ కస్టమర్లు గత నెలలో జత కలవగా మిగిలిన ఆపరేటర్లు (వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, ఇతర) 1.01 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయారు. గత అక్టోబరు 31నాటికి 42.76కోట్ల ఖాతాదారులున్న వోడాఫోన్ ఐడియా 73.61లక్షలమంది వినియోగదారులను కోల్పోయింది. అలాగే ఎయిర్టెల్ 18.64 లక్షలమందిని పోగొట్టుకుని 34.17కోట్ల ఖాతాదారులకు పరిమితమైంది. ఇక టాటా టెలీసర్వీసెస్ 9.25 లక్షలు, ఎంటిఎన్ఎల్ 8068, ఆర్‌కాం 3831వినియోగ దారులను పోగొట్టుకున్నాయి.
టెలికాం మార్కెట్లో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబరులో 119.14 కోట్లు. కాగా అక్టోబర్ నెలలో 119.2 కోట్లకు పెరిగింది. మొబైల్ ఫోన్ సెగ్మెంటులో ఖాతాదారుల సంఖ్య సెప్టెంబరులో 116.92 కోట్ల నుంచి అక్టోబర్‌లో 117 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment