న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్‌ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. ఇరు కంపెనీలు ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 – 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఊరటనిచ్చే విషయమే. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. అనిల్ అంబానీ తాజా రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించిన రెండు రోజుల్లోనే ఈ డీల్ కుదరడం, రిలయన్స్ వ్యవస్థాపకులు, ధీరూభాయ్ అంబానీ 85వ జయంతి రోజున (గురువారం) వెల్లడి కావడం విశేషం.
సరైన సమయంలో అదనపు వివరాలు...
ఆర్‌కామ్ ఆస్తుల విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను ఆర్‌కామ్ నియమించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఆస్తుల కొనుగోళ్లకు గాను రెండు దశల బిడ్డింగ్ ప్రక్రియలో తమ కంపెనీకే విజయం దక్కిందని పేర్కొంది. ఈ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా తాము భారీ స్థాయిలో వైర్లెస్, ఫైబర్–టు–హోమ్, ఎంటర్‌ప్రైజెస్ సేవలందించడానికి వీలవుతుందని వివరించింది. ఈ కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి, వివిధ అధికారిక సంస్థల నుంచి రుణ దాతల నుంచి ఆమోదాలు పొందాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని, సరైన సమయంలో ఇతర అదనపు వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా రిలయన్స్ జియోకు 16 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఆర్‌కామ్ ఆస్తుల కొనుగోలు ప్రక్రియలో వివిధ సంస్థలు రిలయన్స్ జియోకు సలహా సేవలనందించాయి. గోల్డ్‌మన్ శాక్స్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, జేఎమ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, డేవిస్‌పాక్ అండ్ వార్డ్‌వెల్ ఎల్‌ఎల్‌పీ, సిరిల్ అమర్‌చంద మంగళ్‌దాస్, ఖైతాన్ అండ్ కో, ఎర్నస్ట్ అండ్ యంగ్‌లు సలహాదారులుగా వ్యవహరించాయి.
రుణభారం తగ్గించుకుంటాం...
ఈ డీల్‌లో భాగంగా రిలయన్స్ జియో నగదు చెల్లిస్తుందని, దీంతో పాటు టెలికం డిపార్ట్‌మెంట్‌కు చెల్లించాల్సిన వాయిదా పడిన స్పెక్ట్రమ్ వాయిదాలను కూడా చెల్లిస్తుందని ఆర్‌కామ్ తెలిపింది. ఈ డీల్ ద్వారా వచ్చిన సొమ్ములను రుణ భారం తగ్గించుకోవడానికే వినియోగిస్తామని పేర్కొంది. నిర్వహణ వ్యయాలు భరించే స్తోమత లేకపోవడంతో నెల క్రితం ఆర్‌కామ్ మొబైల్ వాయిస్ వ్యాపారాన్ని మూసేసింది. కాగా గతంలో రూపొందించిన కొంత వాటాను బ్యాంక్‌లకు ఈక్విటీగా మార్చే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను రద్దు చేస్తున్నామని ఈ వారం మొదట్లోనే ఆర్‌కామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రుణదాతలకు ఎలాంటి ఈక్విటీ కేటాయింపుల్లేని తాజా రుణ ప్రణాళికను అనిల్ అంబానీ ప్రకటించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా దివాలా పిటిషన్‌ను దాఖలు చేసిన చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా ఈ తాజా రుణప్రణాళికకు ఆమోదం తెలిపింది.
షేరు... పరుగో పరుగు
స్టాక్ మార్కెట్లో ఆర్‌కామ్ షేరు జోరు కొనసాగుతోం ది. అనిల్ అంబానీ రుణ ప్రణాళికను ప్రకటించిన రోజు నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో 60 శాతానికి పైగా ఎగసిన ఈ షేర్ గురువారం మరో 8 శాతం లాభపడి రూ.31 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 18 శాతం లాభంతో రూ.34ను తాకింది. మొత్తం మీద గత మూడు రోజుల్లో ఈ షేర్ దాదాపు 70 శాతం పెరిగింది. గత వారంలో రూ.3,000 కోట్ల మేర మాత్రమే ఉన్న ఆర్‌కామ్ మార్కెట్ విలువ గురువారం రోజు రూ.8,562 కోట్లకు ఎగసింది.
జియో పరమవుతున్న ఆర్‌కామ్ ఆస్తులు
►43,000 టెలికం టవర్లు
►1,78,000 కి.మీ. ఫైబర్ నెట్‌వర్క్
►5 మిలియన్ చదరపుటడుగుల స్థలంలో విస్తరించిన 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్,
►800/900/1800/2100 మెగాహెట్జ్ బాండ్స్‌లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్
Comments
Please login to add a commentAdd a comment