ఇంకెన్ని సంచలనాలో: జియో యూజర్లు బీ రెడీ
ఇంకెన్ని సంచలనాలో: జియో యూజర్లు బీ రెడీ
Published Wed, Jul 19 2017 3:54 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశానికి(ఏజీఎం) సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. సూపర్ స్పీడులో అత్యధిక డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం వంటి ఆఫర్లతో ఇప్పటికే టెలికాం మార్కెట్‌ను కుదిపేసిన రిలయన్స్, ఈ మీటింగ్‌లో చేయబోయే ప్రకటనలపై మార్కెట్‌లో సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ సమావేశంలోనే అత్యంత చౌకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేయబోతుందని టాక్.
జియో ఫీచర్ ఫోన్‌పై ఇప్పటికే పలు ఆసక్తికర రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఫోన్ 500 రూపాయలకే మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌తో మొబైల్ సెక్టార్‌లో కూడా ముఖేష్ అంబానీ సంచలనాలు సృష్టించబోతున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు జియో ఫీచర్ ఫోన్‌ను తయారుచేసేందుకు ఈ కంపెనీకి, ఇంటెక్స్‌కు మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మానుఫ్రాక్చరింగ్ చర్చలు తుది దశలో ఉన్నాయని ఇంటెక్స్ స్పష్టంచేసింది.
ఫీచర్ ఫోన్‌తో పాటు బ్రాడ్ బ్యాండు నెట్‌వర్క్ జియోఫైబర్‌ను కూడా రిలయన్స్ ఆవిష్కరించబోతుందని టాక్. ఈ ప్రకటన కూడా బ్రాడ్ బ్యాండు ఇండస్ట్రీని షేక్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, జమ్మునగర్, సూరత్, వడోదరా వంటి ప్రాంతాల్లో జియోఫైబర్ ప్రీవ్యూ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్న ఈ సేవలపై జీరో రూపాయలకు 3 నెలల పాటు ప్రతినెలా 100ఎంబీపీఎస్ స్పీడులో 100జీబీ డేటాను జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని తెలుస్తోంది.
అయితే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి తొలుత 4500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా తర్వాత రీఫండ్ చేయనున్నామని కంపెనీ అంతకముందే క్లారిటీ ఇచ్చేసింది. బ్రాడ్‌బ్యాండు సర్వీసు ధరలు కూడా 500 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది. 500 రూపాయలకు 600జీబీ డేటా, 2000 రూపాయలకు 1000జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడులో జియో ఆఫర్ చేయనుంది.
Advertisement