న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 72కు చేరుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అయితే ఇందుకు భిన్నమైన అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. గత శుక్రవారం (17వ తేదీ) రూపాయి 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 70.40 స్థాయినీ చూసింది.
అయితే ప్రస్తుతం కొంచెం బలపడి 69.80 స్థాయిలో ట్రేడవుతోంది. రూపాయి సమీప భవిష్యత్తులో కొంత బలపడి, తన వాస్తవ విలువకు చేరుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రూపాయి పతనానికి డాలర్ ఇండెక్స్ బలోపేతం కారణం తప్ప, దేశీయంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులూ లేవన్నది వారి అభిప్రాయం. ఆయా అభిప్రాయాలను పరిశీలిస్తే...
మరీ ఆందోళన అక్కర్లేదు
విస్తృత ప్రాతిపదికన అన్ని దేశాల కరెన్సీలనూ తీసుకుంటే, భారత్ కరెన్సీ ఒక్కటే బలహీనపడలేదు. దీనిపై ఎక్కువ అందోళన చెందా ల్సిన పనిలేదు. పైగా పలు గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి గడచిన ఐదేళ్లలో స్థిరీకరణ పొందుతోంది. – సంజీవ్ సన్యాల్, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారు
‘అమెరికా–చైనా’ ఫలితమిస్తాయి
వాణిజ్య యుద్ధంపై అమెరికా–చైనాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. టర్కీ కరెన్సీ సంక్షోభం కూడా సమసిపోతుంది. దీనితో అభివృద్ధి చెందుతున్న పలు ఆసియా దేశాల్లో కరెన్సీల్లో రిలీఫ్ ర్యాలీ చోటుచేసుకుంటోంది. ఇది భారత్ కరెన్సీకి లాభించే అంశమే. – ముస్తఫా నదీమ్, ఎపిక్ రిసెర్చ్ సీఈఓ
వాస్తవ విలువకు చేరుకుంటుంది
రూపాయి పతనం పట్ల ఆందోళన అక్కర్లేదు. రూపాయి తన వాస్తవ విలువకు చేరుకుంటుంది. రూపాయి విలువ బలంగా, బలహీనంగా ఉండడం కాదు. అది వాస్తవ పరిస్థితికి తగిన విధంగా ఉండాలి. రూపాయి ఉండాల్సిన వాస్తవ విలువలో కొనసాగుతుందని భావిస్తున్నా. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
68–69 మధ్య స్థిరీకరణ
డాలర్ మారకంలో రూపాయి విలువ 68–69 శ్రేణిలో స్థిరీకరణ పొందుతుందని భావిస్తున్నా. ఈ నెలలో దేశానికి విదేశీ పెట్టుబడులు బాగుండడం ఇక్కడ గమనార్హం. స్థూల ఆర్థిక అంశాల పటిష్టత నేపథ్యంలో రూపాయి రికవరీ తథ్యం. – సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
ఇతర దేశాలతో పోలిస్తే బాగుంది
రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా, టర్కీల వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే రూపాయి మెరుగైన స్థితిలో ఉంది. భారత్ కరెన్సీలో బలహీనతలకన్నా డాలర్ బలోపేతం కావడమే రూపాయి ఇటీవల బలహీనతకు ప్రధాన కారణం. – తుషార్ ప్రధాన్, హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్
సావరిన్ క్రెడిట్‌కు వచ్చిన భయమేదీ లేదు: ఫిచ్
డాలర్ మారకంలో రూపాయి పతనం వల్ల దేశ సావరిన్ రేటింగ్‌కు వచ్చిన నష్టమేదీ లేదని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అభిప్రాయపడింది. అమెరికా ఫెడ్ రేటు పెంపు (ప్రస్తుతం 2 శాతం) నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సంబంధించి సెంటిమెంట్లలో మార్పు వంటి అంశాలు రూపాయి బలహీనతలో ప్రతిబింబిస్తున్నాయని ఒక నివేదికలో వివరించింది. రూపాయి బలహీనపడినా... సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ముప్పేమీ ఉండదని పేర్కొన్న ఫిచ్ ఈ సందర్భంగా... అంతర్జాతీయ కోణంలో భారత్ సానుకూల ఆర్థిక అంశాలను ప్రస్తావించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 13 శాతంగా ఉన్న ఫారెక్స్ విదేశీ రుణ భారాన్ని ఈ సందర్భంగా ఉదహరించింది.
వర్ధమాన దేశాలతో పోల్చితే ఇది తక్కువ పరిమాణమని వివరించింది. క్రూడ్ ధరల పెరుగుదల వల్ల 2018–19 మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు (దేశానికి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 1.9 శాతంగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్ 3 శాతంగా ఉంటుందన్నది ఫిచ్ విశ్లేషణ. విదేశీ ఒత్తిడుల వల్ల రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మరో అర శాతం పెంచే వీలుందని అభిప్రాయపడింది. రూపాయి ఒడిదుడుకులను ఆర్‌బీఐ ఎదుర్కొనగలదని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment