
రహస్య పత్రాలను 48 గంటల్లో వెనక్కిచ్చేయండి
మిస్త్రీకి టాటా సన్స్ మరో లీగల్ నోటీసు...
సమాచారం బయటపెట్టనని హామీ ఇవ్వాలంటూ డిమాండ్
న్యూఢిల్లీ: కంపెనీకి సంబంధించిన రహస్య సమాచార పత్రాలన్నింటినీ తమకు వెంటనే తిరిగి స్వాధీనం చేయాలని టాటా సన్స్... సైరస్ మిస్త్రీని కోరింది. కంపెనీ ఆంతరంగిక సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా గోప్యతా నిబంధనల్ని మిస్త్రీ ఉల్లంఘించారంటూ టాటా సన్స్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. తప్పుడు పద్ధతుల్లో, విశ్వాసరహితంగా, తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి ఈ పత్రాలను తీసుకెళ్లినట్టు ఆరోపించింది. చట్ట ప్రకారం శిక్షించదగిన నేరంగా దీన్ని పేర్కొంది. వెంటనే 48 గంటల్లోపు వాటిని తమకు స్వాధీనం చేయాలని, కాపీలను కూడా తన దగ్గర ఉంచుకోవద్దని కోరింది. ఆ సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బహిర్గతపరచనని, గోప్యతను కాపాడతానని హామీ పత్రంపై సంతకం చేయాలంటూ గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది.
మూడు రోజుల్లో మిస్త్రీకి ఇది రెండో లీగల్ నోటీసు కావడం గమనార్హం. ‘‘టాటా సన్స్‌తోపాటు, నిర్వహణ కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా వ్యవహరించిన మీ దగ్గర కంపెనీకి సంబంధించిన రహస్య, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారం ఉంది. చట్ట ప్రకారం విధుల్లో భాగంగా ఆ గోప్యతను, డైరెక్టర్‌గా మీకు తెలిసిన రహస్య సమాచారాన్ని కాపాడాల్సి ఉంటుంది. దీన్ని వెల్లడించరాదు. ఈ సమాచారాన్ని దేనికీ వినియోగించరాదు. అలాగే, అనుబంధ సంస్థలు, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయరాదు’’ అంటూ టాటా సన్స్ తన నోటీసులో మిస్త్రీని కోరింది. చట్టబద్ధమైన ఈ విధులను ఉల్లంఘిస్తే టాటా సన్స్‌కు కోలుకోలేని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, టాటా గ్రూపునకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం మిస్త్రీ వద్ద ఉందని పేర్కొంది.
అభ్యర్థన మాత్రమే...
టాటా సన్స్ పంపిన లీగల్ నోటీసుపై మీడియా విచారణలకు మిస్త్రీ కార్యాలయం స్పందించింది. నోటీసుగా పేర్కొంటున్న టాటా లేఖ... కోర్టులు, ట్రిబ్యునళ్లకు డాక్యుమెంట్లను, రికార్డులను అందించవద్దని, అవి గోప్యంగా ఉంచాల్సినవంటూ చేసిన అభ్యర్థన మాత్రమేనని పేర్కొంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించబోమని, వార్తల కోసం ప్రత్యుత్తరం ఇవ్వబోమని మిస్త్రీ కార్యాలయం స్పష్టం చేసింది. గోప్యత అంటూ వారు తమ లేఖలను మీడియాకు విస్తృతంగా పంపిణీ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విధమైన ప్రవర్తన న్యాయ వ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నట్టు మిస్త్రీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.