
ఆర్థిక సంవత్సరం 2015–16కి, అలాగే 2016–17కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా? అయితే ఇదొక్కసారి చదవాల్సిందే...
ముందుగా 2015–16 విషయానికొస్తే...
ఈ ఆర్థిక సంవత్సరం గడువు తేదీలు 2016 జూలై, సెప్టెంబర్‌తో ముగిశాయి. అప్పుడే గడువు తేదీని పొడిగించారు. అప్పుడు వేయలేనివారు 31.3.2018 లోపల వేయొచ్చు. 31.3.2018 దాటిపోతే వేయడానికి అవకాశం ఉండదు. అయితే ఆ సంవత్సరం ఏదైనా నష్టాన్ని కానీ వడ్డీని కానీ రాబోయే సంవత్సరం ఆదాయంలోంచి తగ్గించే సర్దుబాటు మాత్రం ఉండదు. ఆ సర్దుబాటు హక్కు కేవలం గడువు తేదీ లోపల వేసిన వారికే ఉంటుంది. రిటర్నులు వేయకపోతే వడ్డీలు, పెనాల్టీలు, జైలు శిక్షలు వంటివి ఉంటాయి. అందుకే రిటర్నులు తప్పక వేయాలి.
ఇక 2016–17 ఆర్థిక సంవత్సరం
2016–17 ఆర్థిక సంవత్సరం రెండు గడువు తేదీలు.. జూలై, సెప్టెంబర్. వీటిని కూడా కొన్ని రోజులు పొడిగించారు. మొదటి గడువు ట్యాక్స్ ఆడిట్ లేనివారికి, రెండో గడువు ట్యాక్స్ ఆడిట్ ఉన్నవారికి. ఈ గడువు తేదీలు ముగిసిపోయాయి. 2018 మార్చిలోకి ప్రవేశించాం. ఈ ఏడాది రిటర్నులు దాఖలు చేయడానికి ఆలస్యంగా 31.3.2018 వరకు అవకాశం ఉంది. ఆలస్యం కారణంగా నష్టాన్ని కానీ, వడ్డీని కానీ సద్దుబాటు చేయరు. కానీ మిగతా ప్రయోజనాలు ఉంటాయి.
అవి ఏమిటంటే..
♦ మిమ్మల్ని డిఫాల్టర్‌గా పరిగణించరు.
♦ రుణాల మంజూరీకి ఉపయోగపడుతుంది.
♦ మీ క్రెడిట్ విశ్వసనీయత పెరుగుతుంది.
♦ వడ్డీలు తప్పించుకున్నా.. పెనాల్టీలు పడతాయి.
ఇక 2017–18 సంవత్సరం నుంచి ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే వేలల్లో ఆలస్య రుసుము చెల్లించాలి. జీవితంలో మాదిరే ఆర్థిక అంశాల్లోనూ అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం.