
డెట్ నుంచి ఈక్విటీలోకి మారుదామా?
నిమేష్ షా
ఎండీ. ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ
గత రెండేళ్లలో పూర్తిగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటోంది. ఆర్థిక వాతావరణం మెరుగుపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. వాణిజ్య లోటు తగ్గడం, టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉపశమించడం వంటి అంశాలను ఇందుకు నిదర్శనాలుగా పేర్కొనవచ్చు. ప్రధానంగా దిగుమతులు తగ్గడంతో కరెంట్ ఖాతాలోటు జీడీపీలో 0.9%కు దిగివచ్చింది. ఇదే విధంగా 2009 ఫిబ్రవరిలో 12%కు చేరిన టోకు ధరల ద్రవ్యోల్బణం.
ఈ ఫిబ్రవరిలో 4.3%కు దిగివచ్చింది. దీంతో పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలను తీసుకునేందుకు వీలు చిక్కుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే ఆర్థిక వృద్ధిపై దృష్టిపెట్టేందుకు అవకాశం లభిస్తుంది.
ఫలితంగా ఇన్‌ఫ్రా రంగానికి తగిన ప్రాధాన్యత లభిస్తుంది. దీంతో ఉద్యోగ కల్పన, వినియోగం, పొదుపు వంటివి పుంజుకునేందుకు వీలు చిక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడం, వృద్ధిపై ప్రత్యేక దృష్టి, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సెక్యూరిటీల(డెట్)లో పెట్టుబడులకు దారితీస్తాయి.
చిన్న షేర్లు అనుకూలం
దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్‌ఈ సెన్సెక్స్ నూతన గరిష్టస్థాయిల వద్ద కదులుతోంది. గతంలో నమోదు చేసిన గరిష్టస్థాయిని దాటి నిలబడటానికి సెన్సెక్స్‌కి ఆరేళ్ల సమయం పట్టింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌లోని కొన్ని బ్లూచిప్ షేర్ల ధరలు 2008 గరిష్ట స్థాయిలను అధిగమించినా, చాలా మధ్య, చిన్న తరహా కంపెనీలు ఇంకా వెనకబడి ఉన్నాయి.
2008 జనవరిలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 10,113ను తాకగా, ప్రస్తుతం 7,339 వద్ద ఉంది. అంటే ఇంకా 27% వెనకబడి ఉంది. వెరసి మిడ్ క్యాప్ షేర్లు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీ యంగా ఉన్నాయి. పెట్టుబడులపై భారీ ఆర్జన(రిటర్న్)కు మిడ్ క్యాప్స్‌లో అధిక అవకాశాలు కనిపిస్తున్నాయ్.
గత కొన్నేళ్లుగా దేశీ ఇన్వెస్టర్లు పసిడి , రియల్టీ వంటి ఆస్తుల కొనుగోలుపై పెట్టుబడులు వెచ్చిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ఇన్వెస్టర్లు ఈక్విటీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. భవిష్యత్ లాభాల కోసం ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడులను చేపట్టవచ్చు.
డెట్ ఆకర్షణీయం కాదు
డెట్‌లో పెట్టుబడులు ఇకపై అంత ఆకర్షణీయ ఫలాలను అందించలేకపోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పడితే వడ్డీ రేట్ల తగ్గింపుపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెడుతుంది. 2002 నుంచి చూస్తే గత 11ఏళ్లలో వడ్డీ రేట్లు 10.4-4.75% మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
వడ్డీ రేట్లు ఎప్పుడు పెరిగితే అప్పుడు ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అలాకాకుండా వృద్ధి వేగమందుకుంటే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుంది. 2002-04 మధ్య కాలంలో వడ్డీ రేట్లు 10% స్థాయి నుంచి 5%కు తగ్గాయి. మళ్లీ 2008లో 9% నుంచి 5%కు నెమ్మదిగా దిగివచ్చాయి.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లోనూ టోకు, రిటైల్ ధరల వేగం 7.5-4.5% స్థాయిలోనే స్థిరంగా ఉండే అవకాశముంది. ఇదే విధంగా కరెంట్ ఖాతా లోటు 1.5%గా నిలిస్తే రూపాయికి కూడా స్థిరత్వం లభిస్తుంది. వీటికితోడు ఓ మోస్తరుగా ఉన్న రుణ వృద్ధి కూడా వడ్డీ తగ్గింపునకు దారితీస్తుంది.