బీపీ సీఈవో బాబ్ డుడ్లే, ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ
♦ కేజీ డీ6లో నూతన గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి
♦ 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి
♦ సంయుక్తంగా పెట్రోల్ పంపులు
♦ మరిన్ని అంశాల్లో సహకారానికి అంగీకారం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) పీఎల్‌సీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. మరిన్ని అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించుకున్నాయి. కొన్నేళ్ల విరామం తర్వాత ఇరు సంస్థలు కలసి కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధిలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాలను అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. గురువారం ఢిల్లీలో బీపీ సీఈవో బాబ్ డుడ్లేతో కలసి ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ భాగస్వామ్యంపై మీడియాకు వివరాలు వెల్లడించారు.
సంయుక్తంగా రిటైల్ పెట్రోల్ పంపుల ఏర్పాటు, విమాన ఇంధన (ఏటీఎఫ్) మార్కెటింగ్‌తోపాటు నూతన వ్యాపార అవకాశాలైన సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వాణిజ్యం, మార్కెటింగ్ అంశాల్లో వ్యూహాత్మక సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. విధానాల్లో మార్పులు కొత్త వనరుల అభివృద్ధికి తమకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. కేజీ డీ6 బ్లాక్‌లోని ఆర్–సిరీస్ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి పురోగతికి, 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తమ మధ్య అంగీకారం కుదిరిందన్నారు. 2020–22 నాటికి కేజీ డీ6 బ్లాక్ నుంచి నిత్యం 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఇది అప్పటి దేశ గ్యాస్ అవసరాల్లో 10 శాతం మేర తీరుస్తుందని, 20 బిలియన్ డాలర్ల మేర దిగుమతులను నివారిస్తుందన్నారు. ఇంధన ట్రేడింగ్, కర్బన ఉద్గారాల ట్రేడింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంటామన్నారు.
ఆర్బిట్రేషన్ కేసులతో ఇబ్బందేమీ లేదు
పలు అంశాలపై ప్రభుత్వంతో కొనసాగుతున్న ఆర్బిట్రేషన్ ప్రక్రియ తమ కొత్త పెట్టుబడులపై ప్రభావం చూపబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఓఎన్‌జీసీ బావుల్లోని గ్యాస్ తోడేయడంపై ఆర్‌ఐఎల్ 1.55 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లు) పరిహారం చెల్లించాలని కేంద్రం ఆర్‌ఐఎల్‌కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనితోపాటు మరో మూడు ఆర్బిట్రేషన్ కేసులు ఆర్‌ఐఎల్, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్నాయి. ‘‘ఇక్కడే కాదు కేసులన్నవి ప్రపంచమంతటా ఉన్నవే. దీనికి పారదర్శకమైన పరిష్కారం లభిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని డుడ్లే సైతం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా సమస్యలన్నీ తగిన రీతిన పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.
స్వేచ్ఛాయుత ధరల విధానం ఉండాలి: డుడ్లే
బీపీ 2011లో 7.2 బిలియన్ డాలర్లతో కేజీ డీ6, మరో 20 బ్లాకుల్లో 30 శాతం వాటా తీసుకుందని ఆ సంస్థ సీఈవో డుడ్లే తెలిపారు. వీటితో పాటు ఆర్ సిరీస్, డీ–55 ఆవిష్కరణల నుంచి గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు గాను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. భారత మార్కెట్ ‘ఫ్రీ మార్కెట్ ప్రైసింగ్’ (ధరలను మార్కెట్‌కు విడిచిపెట్టడం) విధానం వైపు అడుగులు వేయాలని కోరారు. పర్యావరణానికి అనుకూల సహజ వాయువు విషయంలో స్వేచ్ఛాయుత మార్కెట్ ధరలకు మద్దతిత్చే విధానాలు అవసరమన్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా డుడ్లే ప్రధాని మోదీ, పెట్రోలియం మంత్రి ప్రధాన్‌లను కలిశారు. సహజవాయువు ధరల విధానాన్ని సమీక్షించాలని, సముద్రంలో మరీ లోతైన ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు అధిక రేటు ఉండాలని బీపీ కోరుతోంది.
ఇంధన రిటైల్‌లో పెట్టుబడులు పెట్టండి
రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్‌సీలను ఇంధ న రిటైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్రం కోరింది. ఆర్‌ఐఎల్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. బీపీ గతేడాదే పెట్రోల్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. గురువారం బీపీ సీఈవో బాబ్ డుడ్లే, ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీలతో కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 80 నిమిషాల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రిటైల్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని బీపీ, రిలయన్స్ సంస్థలను ఆహ్వానించినట్టు ప్రధాన్ సమావేశం అనంతరం ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.