చమురు శాఖకు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వ్యయ రికవరీలో అడ్డుకోవాలన్న చమురు శాఖ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్న ప్రకారం కేజీ బేసిన్లో గ్యాస్‌ను ఉత్పత్తి చేసి ఉంటే ప్రభుత్వానికి 11.53 కోట్ల డాలర్ల లాభం వచ్చి ఉండేదని చమురు శాఖ లెక్కగట్టింది. ఈ మేరకు రిలయన్స్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 11.5 కోట్ల డాలర్లను తగ్గించాలని గెయిల్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్)లను చమురు శాఖ కోరింది.
ఇదే విషయాన్ని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత నెలలో పార్లమెంటులో వెల్లడించారు కూడా. అయితే, రిలయన్స్ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురు, గ్యాస్‌లకు తాము చెల్లించాల్సిందేమీ లేదనీ, కనుక 11.5 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయడం సాధ్యంకాదనీ ఓఎన్‌జీసీ, సీపీసీఎల్ ఆశక్తతను వ్యక్తంచేశాయి.
2009 మార్చి నుంచి 2014 ఏప్రిల్ వరకు కేజీ డీ6 బ్లాకు నుంచి క్రూడ్‌ను తాము కొనుగోలు చేసినట్లు సీపీసీఎల్ పేర్కొంది. ఆ తర్వాత చమురు కొనుగోలు టెండరును ఆర్‌ఐఎల్ జామ్‌నగర్ రిఫైనరీస్ చేజిక్కించుకోవడంతో తాము రిలయన్స్‌కు చెల్లించాల్సిన బాకీలేవీ లేవని చమురు శాఖకు తెలిపింది. కేజీ డీ6లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో రోజుకు 2.594 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను తమకు కేటాయించారని గెయిల్ పేర్కొంది. అయితే, ఆ బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోవడంతో గతేడాది జూన్ నాటికే తమకు సరఫరా ఆగిపోయిందని వివరించింది.
గ్యాస్ కొనుగోలు ఒప్పందం గడువు కూడా గత మార్చి 31తో ముగిసిందని తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో చమురు శాఖ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది జామ్‌నగర్ రిఫైనరీస్‌కు క్రూడ్ ఆయిల్ అమ్మకాన్ని ఆపేసి, దాన్ని సీపీసీఎల్ కొనేలా చేయడం. అయితే ఇందుకు కొంత కాలం పడుతుంది. రెండో మార్గం.. కేజీ డీ6లో ఉత్పత్తయ్యే గ్యాస్ అంతటినీ కొనుగోలు చేస్తున్న ఎరువుల కంపెనీలను 11.50 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయాలని కోరడం. అయితే, ఇది సంక్లిష్టమైన వ్యవహారమని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి.