ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్‌గా ఆర్ఎస్ శర్మ (65) మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామక కమిటీ (ఎసిసి) గురువారం ఆమోదం తెలిపింది. ట్రాయ్ చైర్మన్‌గా శర‍్మను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం సెప్టెంబర్ 30, 2020వరకు ఆర్ఎస్ శర్మ ఈ పదవిలో కొనసాగుతారు. ట్రాయ్ చైర్మన్‌గా ఆయన పదవీకాలం రేపటితో ముగియనుండగా ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని రెండేళ్లపాటు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. 2015 ఆగస్ట్‌లో తొలిసారిగా శర్మ ట్రాయ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కాగా సోషల్ మీడియాలో ఒకరు విసిరిన సవాల్‌కు స్పందిస్తూ తన వివరాలు బయటపెట్టాలని శర్మ ఆధార్ సంఖ్య సవాలు అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆయన ఛాలెంజ్‌నుస్వీకరించిన హ్యాకర్లు ఆయన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఈ మెయిల్ సమాచారాన్ని ట్వీట్ చేశారు. మరికొందరు ఆయన బ్యాంక్ ఖాతాలో ఒక రూపాయి జమ చేశారు. అయితే దీనిపై స్పందించిన ఆధార్ అధికారులు.. ఆ వివరాలు యూఐడీఏఐ నుంచి సేకరించినవికావని స్పష్టం చేశారు. గూగుల్, ఇతర పబ్లిక్ డొమైన్ల నుంచి శర్మ వివరాలను హ్యాకర్లు సంపాదించారని ప్రకటించారు. అలాగే ఆధార్ వల్ల తన వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదని, అలా వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్ లేకుండానే తెలుసుకోవచ్చని శర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment