సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం అన్నందుకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మను నెటిజన్లు ఓ రేంజ్‌లో అడుకుంటున్నారు. నిన్న ఆయన వ్యక్తిగత వివరాలను విచ్చలవిడిగా వైరల్ చేసిన హ్యాకర్లు.. పలువురు నెటిజన్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను తస్కరించిన హ్యాకర్లు తలా రూ.1ని ఆయన ఖాతాలో డిపాజిట్ చేశారు. అనంతరం ఈ స్క్రీన్ షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. పేటీఎం, భీమ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా ఆ డబ్బును జమ చేయటం విశేషం.
అంతేకాకుండా శర్మకు 6 బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలను మొత్తం బయటపెట్టారు. ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమనీ, దమ్ముంటే తన ఆధార్ ను దుర్వినియోగం చేయాలని ఆర్ ఎస్ శర్మ హ్యకర్లకు ట్విటర్లో ఇంతకుముందు సవాలు విసిరారు. తన ఆధార్ నంబర్‌ను కూడా బయటపెట్టారు. దీంతో రెచ్చిపోయిన హ్యాకర్లు శర్మ ఈ-మెయిల్, ఆయన అడ్రస్, పాన్, ఓటర్ ఐడీలు, పుట్టిన రోజు, ఎయిర్ ఇండియా ఆయనకిచ్చిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీలను బయటపెట్టారు.
మరికొందరు హ్యాకర్లయితే ఏకంగా ఆయన ఫొటో, వివరాలతో దొంగ ఆధార్ కార్డును తయారుచేసి ఫేస్ బుక్, ఆమేజాన్ క్లౌడ్ సర్వీసుల్లో రిజిస్టర్ అయ్యారు. మరో వ్యక్తి అయితే శర్మ అడ్రస్ కు వన్ ప్లస్ ఫోన్ ను క్యాష్ ఆన్ డెలివరి ఆర్డర్ పెట్టాడు. ఆధార్ నంబర్, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భరోసా కోసం శర్మ ట్వీట్ చేసినందుకు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment