విదేశీ విద్య భారమవుతోంది! | Rupee fall showing effect on foreign education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్య భారమవుతోంది!

Published Mon, Nov 12 2018 1:34 AM | Last Updated on Mon, Nov 12 2018 11:17 AM

Rupee fall showing effect on foreign education - Sakshi

రూపాయి చుక్కలు చూపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే నానాటికీ పతనమవుతోంది. ఏడాది కిందటిదాకా 62–64 రూపాయల శ్రేణిలో ఉండగా... ఇపుడు 72–74 శ్రేణిలో తిరుగుతోంది. ఏడాది కాలంలో చూస్తే ఏకంగా 16 శాతం వరకూ విలువను కోల్పోయింది. భారతదేశం నుంచి వస్తు, సేవల్ని ఎగుమతి చేసేవారికిది లాభమే!! ఎందుకంటే వారికి చెల్లింపులన్నీ డాలర్లలో జరుగుతాయి కనక మునుపటికన్నా ఎక్కువ విలువ చేతికొస్తుంది. కానీ దిగుమతులు చేసుకునేవారికి ఇబ్బందే. మనకు దిగుమతులే ఎక్కువ!!. ఇవన్నీ పక్కనబెడితే... ఈ బలహీన రూపాయి విదేశాల్లో చదువుకుంటున్న మన విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. కారణం... రూపాయి పతనం నేపథ్యంలో విదేశీ విద్య కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడమే. – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


కరెన్సీ పతనంతో ప్రభావమెంత?
గడిచిన పదేళ్ల కాలంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 46 శాతం తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా డాలర్‌తో 26 శాతం, యూరోతో 25 శాతం క్షీణించింది. రానున్న కాలంలోనూ విదేశీ విద్యా వ్యయం మరింత ఖరీదుగా మారుతుందని ఫైనాన్షియల్‌ సలహాదారులు అంచనా వేస్తున్నారు. అందుకే పిల్లల విద్య కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా రూపాయి విలువ క్షీణతను దృష్టిలో ఉంచుకోవాలనేది వారి సూచన.

‘‘ఇటీవల రూపాయి డాలర్‌తో చాలా ఎక్కువగా నష్టపోవడం వల్ల... ముందుగా దీన్ని ఊహించని, తగిన  ప్రణాళిక వేసుకోని చాలా మంది తల్లిదండ్రులకు ఇబ్బందులెదురయ్యాయి. వారి నిధులు లోటులోకి మళ్లాయి’’ అని ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సేవల సంస్థ ‘హరీపత్తి’ సీఈవో గుర్లీన్‌కౌర్‌ పేర్కొన్నారు.‘‘నష్ట తీవ్రతను అర్థం చేసుకోవడం మంచిది. రూపాయి నష్ట తీవ్రతను అర్థం చేసుకోవాలంటే చరిత్రను చూడాలి. ఏడాది క్రితం డాలర్‌ రేటు 64. ఇప్పుడది 74. ఇది 15 శాతం పతనం’’ అని హ్యాపీనెస్‌ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు అమర్‌ పండిట్‌ చెప్పారు.

అమెరికాలో ఉన్నత విద్యకు ఈ ఏడాది ఆరంభంలో రూ.50 లక్షలు ఉంటే, సంబంధిత కోర్సు కోసం ఇప్పుడు రూపాయల్లో చెల్లించాలంటే అదనంగా రూ.7.80 లక్షలను వెచ్చించాల్సి ఉంటుంది. రూపాయి పతనం రూపంలో రూ.8 లక్షలు భారం అయినట్టు. ‘‘విదేశంలో ఉన్నత విద్యకు మరో పదేళ్ల సమయం ఉంటే, రూ.50 లక్షలు నుంచి కోటి మధ్య సమకూరేలా తగిన ప్రణాళిక రూపొందించేవాళ్లం. కానీ, కరెన్సీ రిస్క్‌ దృష్ట్యా రూ.2 కోట్ల నిధి కోసం ప్రణాళిక వేయాల్సి ఉంటుంది’’ అని గుర్లీన్‌కౌర్‌ చెప్పారు.

స్వల్పకాలంలోనే వెళ్లాల్సి ఉంటే?
రూపాయి అదే పనిగా నష్టపోతూ, డాలర్‌ బలపడుతుంటే విదేశీ విద్య కోసం తమ పిల్లలను పంపాలనుకునే తల్లిదండ్రులపై భారం పడు తుంది. ‘‘సమీప కాలంలో అవసరాలు ఉంటే అధిక రాబడి తో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా అధిక రేటింగ్‌ కలిగిన కార్పొరేట్‌ బాండ్లలోనే మదుపు చేసుకోవాలి. పైగా ఇప్పటి వరకు చేసిన పెట్టుబడికి పెంచి ఇన్వెస్ట్‌ చేసుకోవాలి’’అని దినేశ్‌ రోహిరా వివరించారు. అయితే, లక్ష్యం మరీ దగ్గర్లో  ఉంటే విదేశీ విద్య కోసం చేస్తున్న పెట్టుబడి, రూపాయి క్షీణత రూపంలో చాలకపోవచ్చు. కనుక అదనపు నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ... ప్రణాళిక
మీ పిల్లల్ని గనక విదేశంలో ఉన్నత విద్య కోసం పంపేందుకు ఓ ఐదేళ్ల సమయం ఉందంటే... డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలనేది నిపుణుల సూచన. అంతేకాదు, వీలున్నంత మేర ఈ సిప్‌ మొత్తాన్ని పెంచుకుంటూ ఇన్వెస్ట్‌ చేయాలి. దీనివల్ల మంచి నిధి సమకూరుతుంది. ఇలా పెంచుతూ వెళ్లడం వల్ల రూపాయి క్షీణత ప్రభావాన్ని సులభంగా అధిగమించొచ్చు.

రూపాయి విలువ క్షీణత, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనాలోకి తీసుకోకపోతే... పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌ చేసుకోవాలని పైసాబజార్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగం అధిపతి మనీష్‌కొఠారి సూచించారు. విదేశాల్లో తమ పిల్లల్ని చదివించాలనే అభిలాష ఉన్న తల్లిదండ్రులు అందుకు అవసరమైన మేర అంచనాతో ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం మంచి ఆలోచనగా నిపుణులు చెబుతు న్నారు.

కాంపౌండింగ్‌ మహిమతో నిర్ణీత సమయానికి మంచి నిధి సమకూరుతుంది. ఉదాహరణకు... పిల్లలు పుట్టిన వెంటనే ప్రతి నెలా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.20,000 సిప్‌ చేస్తే... విదేశీ విద్యకు ప్రయాణం అవ్వాల్సిన సమయానికి రూ.2 కోట్ల నిధి సమకూరుతుంది. లక్ష్యానికి ఐదేళ్ల ముందే 50% నిధులను ఈక్విటీల నుంచి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. మూడేళ్ల సమీపానికి రాగానే డెట్‌ ఫండ్స్, ఎఫ్‌డీల్లోకి మార్చుకోవాలి. దీంతో మార్కెట్ల అస్థిరతల ప్రభావాన్ని ఎదుర్కో వచ్చని నిపుణులు తెలియజేశారు.

కరెన్సీ గురించి ముందే యోచన
అభివృద్ధి చెందుతున్న మన దేశంలో విద్యా ద్రవ్యోల్బణం ఏటా 8–10 శాతం మధ్యలో ఉంటోంది. అమెరికాలో 0,  కెనడాలో 3 శాతంగా ఉంది. ‘‘కనుక మనలాంటి వర్ధమాన దేశాల్లో ఉండేవారు అమెరికాలో కోర్స్‌ చేయాలనుకుంటే... విద్యా ద్రవ్యోల్బణం బదులు కరెన్సీ విలువ పతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగానే ప్రణాళిక వేసుకుంటే ఈ ప్రభావం ఎక్కువగా పడదు’’ అని పండిట్‌ సూచించారు.

అక్టోబర్‌ 9వ తేదీన డాలర్‌ మారకంలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39కు పడిన రూపాయి,  అయితే అటు తర్వాత తీవ్ర ఒడిదుడుకులతో నవంబర్‌ 9వ తేదీ శుక్రవారంనాటికి 72.50కి రికవరీ అయ్యింది.


ఎప్పటికప్పుడు సమీక్ష...
రూపాయి విలువ క్షీణత వల్ల విదేశీ విద్యా వ్యయం 10– 14% పెరిగిపోయింది. ఇది మొత్తం వ్యయాలపై ప్రభావం చూపిస్తోంది. రూపాయి ప్రస్తుత స్థాయిల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం అనువైన స్వల్పకాల పెట్టుబడి సాధనాలపై దృష్టి సారించాలి. అలాగే, దీర్ఘకాలిక విధానాలను కూడా సవరించుకోవాలి. రూపాయి పడిపోవడం వల్ల ఎంత మేర ఖర్చు పెరుగుతుందన్న దాన్ని లెక్కలోకి తీసుకుని, ఆ మేరకు పొదుపు పెంచుకోవాలి. – దినేశ్‌ రోహిరా, 5నాన్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు

కదలికలపై భిన్నాభిప్రాయాలు
71కి రికవరీ..!
2019 మార్చి నాటికి 71 వరకూ బలపడే అవకాశం ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిల నుంచి తగ్గడం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ వంటి అంశాలు ఇక్కడ గమనించదగినవి. – క్రిసిల్, రేటింగ్‌ సంస్థ

76కు పతనం?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే 3 నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 స్థాయిని తాకవచ్చు. అయితే  కొంత ఒడిదుడుకులు ఉండచ్చు. – యూబీఎస్, స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement