
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం ఉదయం నష్టాలతో మొదలయ్యింది. డాలర్‌తో రూపాయి మారకంలో మరింత పతనమైన రూపాయి 12 పైసలు నష్టపోయి 68.12 వద్ద ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు (30 పైసలు నష్టం) 68తో పోల్చితే 0.14 శాతం నష్టంతో తాజాగా 16 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ముడిచమురు ధర ఆల్ టైం హైకి చేరడంతోపాటు, అమెరికా చైనాల మధ్య ట్రేడ్‌వార్ సమసిపోయిన నేపథ్యంలో అమెరికా డాలరు విలువ ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
చైనా, అమెరికా రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఒత్తిళ్లను సులభతరం చేయాలని నిర్ణయించామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యుచిన్ పేర్కొనడంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. అటు ముడి చమురు ధర 80 డాలర్లకు చేరుకోవడం తదితర ప్రతికూల అంశాల కారణంగా రూపాయి విలువ 68 స్థాయికి పడిపోయిందని ఎనలిస్టులు విశ్లేషించారు. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ శుక్రవారం ముగింపు 7.833 శాతం కాగా, సోమవారం ఉదయం 7.895 వద్ద మొదలయ్యింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ ఏకంగా 6.2 శాతం పతనమయ్యింది.