ముంబై: రూపాయి మరింత పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ బలపడుతుండటం... భారత్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల తిరోగమనం, ముడి చమురు ధరల పెరుగుదలతో రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ 70ని తాకొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
కాగా, ప్రస్తుతానికి 69.30 రూపాయికి చాలా కీలకమైన స్థాయి అని, దీన్ని గనుక కోల్పోతే వేగంగా 70కి జారిపోవచ్చనేది బ్యాంకర్ల అంచనా. గత నెల 28న రూపాయి ఇంట్రాడేలో 69.10 ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న 68.95 వద్ద ముగింపులో కూడా కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని రూపాయి నమోదు చేసింది. గత శుక్రవారం 68.87 వద్ద ముగిసింది. ‘ముడిచమురు ధరల జోరుతో కరెంట్ అకౌంట్ లోటు (మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం) పెరిగిపోతోంది.
చమురు, ఇతర దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగబాకుతోంది. దీనివల్ల రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ వారంలో రూపాయి విలువ 70ని తాకొచ్చు. అయితే, అ స్థాయిలోనే ఉండిపోయే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ క్షీణతను అడ్డుకోవడానికి ప్రయత్నించొచ్చు’ అని సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జూన్ 29తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 406.05 బిలియన్ డాలర్లకు చేరడంతో ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యానికి తగిన బలాన్ని అందిస్తోందని మరో బ్యాంకర్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఇటీవలే ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం కూడా రూపాయిని దెబ్బతీస్తోందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏఎంఎల్) తాజా నివేదికలో పేర్కొంది. జూన్ 6న ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం పెంచి 6 శాతానికి చేర్చిన నాటి నుంచి చూస్తే భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 2 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని.. అప్పటి నుంచి రూపాయి విలువ 1.9 శాతం పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment