ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు 39 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 68.50 వద్ద ముగిసింది. రూపాయికి ఇది గట్టి నిరోధ స్థాయి. 68.50 స్థాయిని కోల్పోయిన వెంటనే రూపాయి గతంలో వేగంగా మరింత క్షీణించింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే అటు తర్వాత ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా పరిణామాలు తక్షణం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలపడ్డం, క్రూడ్ ఆయిల్ ధరల తక్షణ ఉపశమనం, శుక్రవారం కేంద్ర బడ్జెట్ అంశాలు తక్షణ రూపాయి బలోపేతం నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment