
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్) నివారణకు అవసరమైన సమయంలో మరిన్ని చర్యల్ని తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం మాట్లాడుతూ... రూపాయి రికవరీ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరెన్సీ, స్టాక్ మార్కెట్ల పతనానికి విదేశీ అంశాలే కారణమన్నారు. సెన్సెక్స్ గురువారం 1,000 పాయింట్ల మేర ప్రారంభంలో పడిపోగా, డాలర్‌తో రూపాయి 74.45 స్థాయికి చేరటం గమనార్హం. ‘‘ముందు రోజు అమెరికాలో ఏం జరిగిందో మన దగ్గరా అదే పునరావృతమయింది. ప్రపంచ వృద్ధి రేటు, అమెరికా వృద్ధి రేటును వచ్చే ఏడాదికి ఐఎంఎఫ్ తగ్గించింది. ఈ రెండూ మార్కెట్లపై ప్రభావం చూపించాయి’’ అని ఆ అధికారి వివరించారు. అయితే భారత వృద్ధి రేటు పెరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొనటాన్ని ఆయన గుర్తు చేశారు. చమురు ధరలు క్షీణిస్తాయనేందుకు సంకేతాలు ఉన్నాయని, రూపాయిని అవి సానుకూల పరుస్తాయని చెప్పారు. ‘‘రూపాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, క్యాడ్ ఇవి ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. అయితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాకు తగిన విధానం అమల్లో ఉంది. ఈ అంశాలపై అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు. ఇతర దేశాల ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు ఎక్కువ నిలకడతో ఉన్నట్టు చెప్పారు. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధంతో మన ఆర్థిక వ్యవస్థకు లాభమేనని, విదేశీ మారక నిల్వలు తగినన్ని ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మరికొన్ని దిగుమతులపై సుంకాల పెంపు
కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో కమ్యూనికేషన్ ఉత్పత్తులు, బేస్ స్టేషన్, డిజిటల్ లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిపై సుంకాలను 10% నుంచి 20%కి పెంచింది. కస్టమ్స్ టారిఫ్ చట్టం 1975లోని చాప్టర్ 85 కింద వచ్చే పలు వస్తువులపై దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించినట్టు పరోక్ష పన్నులు, సుంకాల మం డలి(సీబీఐసీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ చాప్టర్ కింద ఎలక్ట్రికల్ మెషినరీ, ఎక్విప్‌మెంట్, సౌండ్ రికార్డర్లు, టెలివిజన్ ఇమేజ్ రికార్డర్లు, వీటి విడిభాగాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, ఏసీలు సహా 19 రకాల దిగుమతులపై సుంకాలు పెంచుతూ గత నెల 26న కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment