భారత్ వెలిగిపోతోంది..!
ఆసియా-పసిఫిక్ దేశాల్లోకెల్లా అత్యుత్తమ ఆర్థిక ప్రగతి...
⇒ రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ వెల్లడి...
⇒ 2015-16 జీడీపీ వృద్ధి అంచనాలు భారీగా పెంపు
⇒ 7.9 శాతానికి ఎగబాకే అవకాశం...
⇒ బడ్జెట్ ముందు మోదీ సర్కారుకు బూస్ట్
ముంబై: మరో రెండు రోజుల్లో తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మోదీ సర్కారుకు ఊహించని బూస్ట్ లభించింది.
ఆసియా-పసిఫిక్ దేశాన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగు రేఖలా కనిపిస్తోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) గురువారం పేర్కొంది. అంతేకాదు రానున్న ఆర్థిక సంవత్సరం(2015-16)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాలను భారీగా పెంచింది. 7.9 శాతం వృద్ధి సాధించవచ్చని తాజాగా లెక్కగట్టింది. అంతక్రితం ఈ అంచనా 6.2 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2016-17లో వృద్ధి అంచనాను కూడా ఏకంగా 6.6 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది.
జీడీపీ గణాంకాలకు బేస్ రేటును కేంద్రం ప్రభుత్వం ఇటీవలే 2004-05 నుంచి 2011-12కు మార్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 2013-14 వృద్ధి రేటును 5 శాతం నుంచి 6.9 శాతానికి సవరించారు. ఈ ఏడాది(2014-15) వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతానికి(గతంలో 6%) పెంచారు కూడా. అయితే, తాజా వృద్ధి అంచనాల పెంపులో ఈ కొత్త బేస్ రేటును పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది ఎస్‌అండ్‌పీ విడుదల చేసిన నోట్‌లో స్పష్టం చేయలేదు.
క్రూడ్ వరం...
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నేలకు దిగిరావడం... దేశీయంగా పెట్టుబడులు పెరుగుతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశాలను పెంచుతున్నాయని ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి రేటు కాస్త తగ్గనున్నప్పటికీ.. భారత్ ఎకానమీ మాత్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపింది. అయితే, చైనా, జపాన్‌లలో మందగమనం కారణంగా మొత్తం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గతేడాది జూన్‌లో 100 డాలర్లకు పైగా ఉన్న క్రూడ్ బ్యారెల్ ధర.. ప్రస్తుతం 50 డాలర్ల స్థాయిలో కదలాడుతున్న విషయం విదితమే.
దీనివల్ల అత్యధికంగా క్రూడ్ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు దిగుమతుల బిల్లు భారీగా తగ్గడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మరింత అదుపులో ఉండేందుకు దోహదం చేస్తోంది. మరోపక్క, ప్రభుత్వానికి ఇంధన సబ్సిడీల భారం కూడా భారీగా తగ్గేందుకు వీలుకల్పిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(శనివారం) ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి లక్ష్యం... అదేవిధంగా ద్రవ్యలోటు కట్టడి(గతేడాది జీడీపీలో 4.1 శాతంగా నిర్ధేశించారు)కి తీసుకోబోయే చర్యలను కూడా వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ తాజా అంచనాలు చర్చనీయాంశంగా మారాయి.
మూడు రోజుల్లోనే ఎంత మార్పు...
భారత్‌లో అధిక ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయాలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేయడంతోపాటు ఇలాగైతే రేటింగ్ పెంపు కష్టమేనంటూ చెప్పిన కొద్ది రోజులు కూడా కాకుండానే ఎస్‌అండ్‌పీ వృద్ధి రేటు అంచనాలను అనూహ్యంగా పెంచేయడం విశేషం. గతేడాది మోదీ నేతృత్వంలో ఏర్పాటైన సుస్థిర ప్రభుత్వం సంస్కరణలకు సానుకూల పరిస్థితులను సృష్టించాయని, అయినప్పటికీ.. పాలనా సామర్థ్యం ఒక్కటే పరపతి రేటింగ్ పెంపునకు సరిపోదని కూడా ఈ నెల 23న ఒక నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం భారత్‌కు బీబీబీ మైనస్(స్థిరమైన అవుట్‌లుక్‌తో) సార్వభౌమ పరపతి రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువ స్థాయి రేటింగ్. దీనికంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు పూర్తిగా ప్రతికూలం) గ్రేడ్‌కు దిగజారినట్లే. మరో అగ్రగామి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా ద్రవ్యలోటు కట్టడి, సంస్కరణల పురోగతిపైనే భవిష్యత్తులో రేటింగ్ మెరుగుదల అవకాశాలు ఆధారపడి ఉంటాయని తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే.