ఆ ఫోన్ నుంచి టన్నుల కొద్దీ బంగారం!
సాంకేతిక లోపాలతో గతేడాది అత్యధికంగా వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుంచి టన్నల కొద్దీ బంగారం రానుందట. ఈ విషయాన్ని స్వయంగా శాంసంగే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన శాంసంగ్ నోట్ 7 ఫోన్‌లు అన్నింటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచదేశాల నుంచి తిరిగి సేకరించిన గెలాక్సీ నోట్7 ఫోన్లను రీ-సైకిల్ చేయనుంది. గెలాక్సీ నోట్7 ఫోన్లను రీ-సైకిల్ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్, రాగి వంటి విలువైన లోహాలను సేకరించనునట్లు తెలిపింది.
ఈ నెల చివర్లోగా ఈ ప్రక్రియను శాంసంగ్ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, ఫోన్‌లోని కొన్ని ముఖ్యభాగాలను మాత్రం విడగొట్టి భద్రపరచనుంది శాంసంగ్. ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, మెమొరీ సెమీ కండక్టర్లు, కెమేరా మాడ్యూల్స్‌ను విడిగా భద్రపరుస్తుంది. రీ-సైకిల్ ప్రక్రియ మొత్తం ఎకో-ఫ్రెండ్లీ పద్ధతుల్లోనే చేయనున్నట్లు తెలిసింది. కొన్ని విడి భాగాలను నోట్ ఎఫ్‌ఈ సర్వీస్ మెటీరియల్‌గా వినియోగించనుంది. అయితే, ఎవరికీ విక్రయించని నోట్7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో తీర్చిదిద్దిన 3,200 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చి నోట్ ఎఫ్‌ఈ పేరుతో విపణిలోకి తీసుకొచ్చింది.