శాంసంగ్ భారీ విస్తరణ
♦ రూ.4,915 కోట్లతో నోయిడా ప్లాంట్ విస్తరణ
♦ స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యం రెట్టింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దేశీయంగా స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్ ఆవరణ పక్కనే ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో కొత్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ.4,915 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం ప్రతిపాదిత నిర్మాణ స్థలంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హాజరయ్యారు.
ఈ విస్తరణ ప్రాజెక్టు వచ్చే రెండేళ్లలో పూర్తి కానుంది. ప్రస్తుతం వార్షికంగా 50 లక్షల స్మార్ట్‌ఫోన్ల తయారీ సామర్థ్యం కాస్తా 1.2 కోట్లకు విస్తరిస్తుంది. రిఫ్రిజిరేటర్ల సామర్థ్యం ప్రస్తుతమున్న 15 లక్షల నుంచి 30 లక్షలకు పెరుగుతుంది. టీవీ ప్యానెళ్ల ఉత్పత్తి 13 లక్షల నుంచి 26 లక్షలు అవుతుంది. తాజా విస్తరణతో నోయిడా తమకు అతిపెద్ద తయారీ కేంద్రం అవుతుందని, కొత్తగా 5,000 ఉద్యోగాలు వస్తాయని శాంసంగ్ తెలిపింది. భారత్‌లో తయారీ, భారత్ కోసం తయారీకి శాంసంగ్ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొంది.