‘సత్యం’ డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష | Satyam case: Ramalinga Raju, two others get six months in jail | Sakshi
Sakshi News home page

‘సత్యం’ డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష

Published Tue, Dec 9 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లు కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించారని నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది.

* కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు
* రామలింగరాజు సహా ఇతర డెరైక్టర్లకు రూ. 10.5 లక్షల చొప్పున జరిమానా
* మరో డెరైక్టర్ కృష్ణాజీకి రూ. 2.66 కోట్ల జరిమానా
* అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నెల రోజులు వాయిదా
* కంపెనీల చట్టం ఉల్లంఘన కేసులోనే ఈ శిక్షలు..
* సీబీఐ కేసులో 23న వెలువడనున్న తీర్పు.. విచారణలోనే సెబీ కేసు

సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లు కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించారని నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్‌ఎఫ్‌ఐవో) 2009లో దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదుల్లో.. ఆరింటిలో వారిని దోషులుగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. అప్పటి సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లుగా ఉన్న రామలింగరాజు, జయరామన్, ఎన్నారై రామ్ మైనంపాటిలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10.5 లక్షల చొప్పున జరిమానా విధించారు.

రామరాజు,  వడ్లమాని శ్రీనివాస్‌కు ఆరునెలల జైలు, రూ.50 వేల వరకు జరిమానా విధించారు. మరో డెరైక్టర్ కృష్ణాజీ పాలెపునకు రూ.2.66 కోట్లు జరిమానా విధిస్తూ.. చెల్లించేం దుకు రెండు నెలలు గడువిచ్చారు. మిగతావారు జరిమానా చెల్లించేందుకు న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. రూ. 50 వేలు జరిమానా చెల్లించడంతో శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేస్తూ.. హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశమిచ్చారు.

సీబీఐ కేసులో..
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 23న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఐదేళ్ల విచారణ తర్వాత ఇటీవల ఈకేసులో తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఇందులో రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణరాజుతోపాటు ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో కోర్టు 216 మంది సాక్షులను విచారించగా.. సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది.

2009 జనవరి 7న సత్యం కంపెనీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. ఈ మేరకు రామలింగరాజుపై హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు విచారణ సీబీఐకి బదిలీ అయ్యింది.

విచారణలో సెబీ కేసు
ఈ కుంభకోణంపై సెబీ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో మూడు ఫిర్యాదులు దాఖలు చేసింది. అందులో రామలింగరాజు సోదరులు, ఇతర కుటుంబ సభ్యు లు, టీవీ-9 అధినేత శ్రీనిరాజు నిందితులు. ఆరోపణలు రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement