స్కామ్ నుంచి తీర్పు వరకూ...
సత్యం కుంభకోణం పరిణామాల క్రమం ఇదీ..
పెనుసంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తాజాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శిక్షలు ప్రకటించింది. వ్యవస్థాపకుడు రామలింగ రాజు సహా ఇతర డెరైక్టర్లకు సోమవారం జైలు శిక్షలు, జరిమానాలు విధించింది. ఈ నేపథ్యంలో సత్యం కుంభకోణం, దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలపై కథనం.
2009లో బయటపడిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. సత్యం కంప్యూటర్స్‌ను 1987లో ప్రారంభించిన రామలింగరాజు 2009 జనవరి దాకా దానికి చైర్మన్‌గా కొనసాగారు. 2008 డిసెంబర్‌లో మేటాస్‌ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకి చెందిన మేటాస్‌ని రామలింగరాజు కుమారులే నిర్వహించేవారు.
అప్పట్లో రియల్ ఎస్టేట్‌కి బాగా బూమ్ ఉండటంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ.. వచ్చిన నిధులను మేటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారన్న అభియోగాలున్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేరుకు మంచి రేటు వస్తుంది కాబట్టి.. అందుకోసం అకౌంటింగ్ కుంభకోణానికి తెరతీశారు. లేని లాభాలు ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు చూపారు. కానీ, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభ ప్రభావంతో రియల్టీ ధరలు పతనమయ్యాయి.
మరోవైపు, తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునేందుకు నిధులూ లేకుండా పోయాయి. ఈ దశలో గణనీయంగా ల్యాండ్‌బ్యాంక్ ఉన్న మేటాస్‌ను సత్యం కంప్యూటర్స్‌లో విలీనం చేసేందుకు రాజు ప్రయత్నం చేశారు. కానీ, సత్యం కంప్యూటర్స్ నిధులను నిరర్ధకమైన రియల్టీలోకి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో కంపెనీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
సత్యం అకౌంట్ల గోల్‌మాల్ జరుగుతోన్న వ్యవహారాన్ని 2009 జనవరిలో రాజు బయట పెట్టారు. లేని లాభాలను లెక్కల్లో చూపినట్లు ఆయన ప్రకటించారు. దాదాపు రూ. 7,000 కోట్ల అకౌంటింగ్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
ఈ భారీ ఖాతాల కుంభకోణం వెలుగులోకిరావడం... సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన అరెస్టయ్యారు. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో), అటు సెబీ దర్యాప్తు చేపట్టాయి. ఎస్‌ఎఫ్‌ఐవో మొత్తం ఏడు కేసులు పెట్టింది. బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడటం, షేర్‌హోల్డర్లను మోసం చేయడం, అక్రమంగా ప్రయోజనాలు పొందటం, చెల్లించని డివిడెండ్లను చెల్లించినట్లుగా చూపడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. తాజాగా ఇందులోనే ఆరు కేసుల్లో కోర్టు శిక్షలు విధించింది.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా..
మరోవైపు, సత్యం కుంభకోణంపై అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా విచారణ జరిపింది. ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తుది ఉత్తర్వులు ఇచ్చింది. సెబీ దర్యాప్తు ప్రకారం ఈ స్కామ్ విలువ రూ.12,320 కోట్లుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి సెబీ రామలింగరాజుపై, మరో నలుగురిపై 14 ఏళ్ల నిషేధం విధించింది. రూ. 1,849 కోట్ల అక్రమార్జనను వడ్డీతో సహా కట్టాలని ఆదేశించింది. వడ్డీతో కలిపితే ఈ మొత్తం రూ. 3 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తేలింది.
కనుమరుగైన బ్రాండ్..
స్కామ్‌లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా... సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. ఆతర్వాత మహీంద్రా సత్యంకూడా టెక్ మహీంద్రాలో పూర్తిగా విలీనంకావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది.