ఎస్‌బీహెచ్ నికరలాభం 91% అప్ | SBH net profit up 91% | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ నికరలాభం 91% అప్

Published Wed, Oct 29 2014 4:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎస్‌బీహెచ్ నికరలాభం 91% అప్ - Sakshi

ఎస్‌బీహెచ్ నికరలాభం 91% అప్

గత 3 నెలల్లో రూ.300 కోట్ల ఎన్‌పీఏల అమ్మకం
ఈ ఏడాది వ్యాపారంలో 12 శాతం వృద్ధి అంచనా
తెలంగాణలో 42 శాతం వ్యవసాయ రుణాలు రోలోవర్
హుదూద్ ప్రాంత రుణగ్రహీతల కోసం ప్రత్యేక పథకం

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం కన్నా లాభాలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక వ్యాపారంలో ఎటువంటి వృద్ధి నమోదు చేయకుండానే నికరలాభంలో 91% వృద్ధిని ఎస్‌బీహెచ్ నమోదు చేయడం విశేషం. గతేడాది ఇదే కాలానికి రూ. 163 కోట్లుగా ఉన్న నికరలాభం  ఇప్పుడు రూ.311 కోట్లకు చేరింది.  మంగళవారం సాయంత్రం ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శాంతను ముఖర్జీ  మాట్లాడుతూ లాభాలను పెంచుకోవడం కోసం అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, తక్కువ వడ్డీరేట్లు ఉన్న రుణాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

గత ఆరు నెలల్లో అధిక వడ్డీలు ఉన్న 6,000 కోట్ల బల్క్ డిపాజిట్లను వదిలించుకున్నామని, దీంతో డిపాజిట్ల వృద్ధిలో క్షీణత నమోదయ్యిందన్నారు. ఈ విధానం అనుసరించడం ద్వారా గత మూడేళ్లలో నమోదు చేయని విధంగా నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధి చెందిందన్నారు. గతేడాది రూ. 945 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ ఏడాది రూ. 1,095 కోట్లకు పెరిగిందని, నికర వడ్డీ మార్జిన్లు 3.09% నుంచి 3.17 శాతానికి పెరిగాయని చెప్పారు.  ఇదే సమయంలో వ్యాపారం రూ.2.18 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు మాత్రమే పెరిగిందని,  ఈ ఏడాది వ్యాపారంలో 12% వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరగలేదని, చివరి త్రైమాసికం నుంచీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాని డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

తగ్గుతున్న నిరర్థక ఆస్తులు
నిరర్థక ఆస్తులు తగ్గించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇందులో భాగంగా నిరర్థక ఆస్తులను విక్రయించడం, రుణాల్ని పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు చెప్పారు. గడచిన మూడు నెలల కాలంలో రూ.300 కోట్ల ఎన్‌పీఏలను అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీల (ఆర్క్స్)కు విక్రయించడం జరిగిందని, అలాగే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ. 75 కోట్ల ఎన్‌పీఏలను వదిలించుకున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా సుమారు మరో రూ. 300 కోట్ల కార్పొరేట్ రుణాలను పునర్‌వ్యవస్థీకరించారు. ఇక నికర ఎన్‌పీఏలు 3.37 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గాయి. గత 3 నెలల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఎన్‌పీఏలు నమోదు కాలేదని, ఇకపై కూడా ఇదే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ముఖర్జీ వ్యక్తం చేశారు.

75% వ్యవసాయ రుణాల రోలోవర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రుణాల రోలోవర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ప్రస్తుతం 42 శాతం రుణాలను రోలోవర్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. రుణ మాఫీ పథకంలో భాగంగా మొదటి దశ కింద తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.6,000 కోట్లు చెల్లించదన్నారు. ఇందులో ఎస్‌బీహెచ్ వాటా రూ.965 కోట్లుగా ఉందన్నారు. నవంబర్ నెలాఖరునాటికి 75 శాతం రుణాలను రోలోవర్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి నిధులు రాలేదని, దాంతో అక్కడ రోలోవర్ మొదలవ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హూదూద్ తుఫాన్‌లో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే  విధంగా కొత్త పథకాన్ని తీసుకురావడంపై ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నట్లు ముఖర్జీ తెలిపారు. చిన్న వ్యాపారస్థులు తీసుకున్న రుణాలు చెల్లింపుపై మారిటోరియం లేదా ఉత్తారఖండ్ తరహాలో విడతల వారీగా రుణాలు చెల్లించే అంశాన్ని  పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement