ముంబై : తమ ఖాతాదారులు ఈనెల 28లోగా తగిన కేవైసీ పత్రాలు సమర్పించని పక్షంలో వారి ఖాతాలను నిలిపివేస్తామని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అసంపూర్తి కేవైసీ పత్రాలను అందించిన వారు తక్షణమే తగిన పత్రాలతో సంప్రదించాలని, భవిష్యత్‌లో బ్యాంకింగ్ లావాదేవీల్లో అసౌకర్యాన్ని నివారించాలని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు జారీ చేసిన బహిరంగ నోటీసులో పేర్కొంది. ఇటీవల బ్యాంకులు పలుమార్లు రికార్డులను అప్‌డేట్ చేస్తూ కేవైసీ పత్రాలను అడుగుతున్నాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ఎస్‌బీఐ తరచూ టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతోంది.
ఎస్‌బీఐ ఖాతాదారులు ఎవరికైనా అలాంటి మెసేజ్‌లు వస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన సమాచారం అందించడం మేలని తగినంత సమయం ఉన్నందున తగిన కేవైసీ పత్రాలను బ్యాంకులో సమర్పించవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్‌ను సంప్రదించి ఎలాంటి చిరునామా, గుర్తింపు కార్డులను అందించి తమ కేవైసీ పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ యూజర్లు తమ కేవైసీని ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. సరైన గుర్తింపు ధ్రువీకరణగా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, పెన్షన్ పేఆర్డర్, విద్యుత్ బిల్లు, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డులను సమర్పించవచ్చు. ఇక ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు కేవైసీ వివరాలను తాజాపరచడంలో భాగంగా బ్యాంకులు ఈ దిశగా కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment