SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్‌బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు.
ఎస్‌బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్‌బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్‌బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్‌బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్‌బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా..
- ఎస్‌బీఐ యోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్‌బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి.
- మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి
- యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి
- ఎస్‌బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది
- అందించిన ఆప్షన్‌ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్‌బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి
- లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి
- క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి
ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు
Comments
Please login to add a commentAdd a comment